Chanda Kochhar: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీడియోకాన్ గ్రూపునకు రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలు, అవినీతికి పాల్పడినట్లు నమోదైన కేసులో విచారణ జరిపిన సీబీఐ వీరిద్దరినీ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో వీరిని సీబీఐ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు. తాజాగా వీరిద్దరినీ ఢిల్లీలో అరెస్టు చేశారు. ఈ కేసులో దీపక్ కొచ్చర్ 2020లోనే ఒకసారి అరెస్టయ్యారు. వీడియోకాన్ గ్రూపునకు అనుకూలంగా వ్యవహరించి, అవినీతికి పాల్పడారనే అభియోగాలపై ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి చందా కొచ్చర్ 2018లో వైదొలిగారు. 2012లో బ్యాంకు సీఈవో హోదాలో రూ. 3,250 కోట్ల రుణం మంజూరు చేశారని.. అది ఎన్‌పీఏగా మారడంతో తద్వారా చందా కొచ్చర్ కుటుంబం లబ్ధి పొందిందని సీబీఐ అభియోగాల్లో పేర్కొన్నారు.
Read Also: Imrankhan Wife: మూడో పెళ్లి చేసుకున్న పాక్ మాజీ ప్రధాని మాజీ భార్య.. వరుడు ఎవరంటే?
మసకబారిన కొచ్చర్ ప్రతిష్ట:
అప్పటి వరకు ఐరన్ లేడిగా ఓ వెలుగు వెలిగిన చందాకొచ్చర్ వీడియోకాన్ కుంభకోణంతో ఆమె ప్రతిష్ట మసకబారింది. ఈ కేసు కారణంగా ఐసీఐసీఐ బ్యాంక్‌లో కీలక పదవులను కోల్పోయింది. అంతేకాకుండా కేసు దర్యాప్తులో భాగంగా చందా కొచ్చర్ ఇల్లు, ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ముంబైలోని చందా కొచ్చర్ ఫ్లాట్, ఆమె భర్త దీపక్ కంపెనీకి చెందిన కొన్ని ఆస్తులను ఈడీ 2020లోనే అటాచ్ చేసింది. వీటి విలువ రూ. 78 కోట్లని అధికారులు వెల్లడించారు. ఈ కేసులో కొచ్చర్ దంపతులతో పాటు వీడియోకాన్ గ్రూప్‌నకు చెందిన వేణుగోపాల్ దూత్‌పైనా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది.