IAF: రక్షణ రంగంలో ఇతర దేశాలపై ఆధారపడకుండా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఆయుధాలు తయారు చేసుకోవాలని భారత్ భావిస్తోంది. దీని కోసమే ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. యుద్ధవిమానాల దగ్గర నుంచి తుఫాకులు, ఫిరంగులు, హెలికాప్టర్లు ఇలా రక్షణ రంగంలో అవసరమయ్యే వాటిని ఇండియాలోనే తయారు చేసుకుని స్వావలంభన సాధించాలని కేంద్రం భావిస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా భారత సైన్యం దేశీయంగా తయారవుతున్న “ప్రచండ్” లైట్ కంబాట్ హెలికాప్టర్లను కొనుగోలు చేయబోతోంది. 156 హెలికాప్టర్ల కోసం HALకి ఆర్ఢర్ ఇవ్వనుంది. వీటిని చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించనున్నారు. గత 15 నెలలుగా అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించిన తర్వాత ఇటీవల 15 హెలికాప్టర్లను ఇండియన్ ఆర్మీలో చేర్చుకున్నారు.
Read Also: New York Sinking: బరువు మోయలేక కూరుకుపోతున్న న్యూయార్క్.. నాసా రిపోర్టులో వెల్లడి..
తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) ఆధ్వర్యంలో 156 హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. త్వరలోనే ఆమోదం పొందుతుందని డిఫెన్స్ అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఐఎఎఫ్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి స్వదేశీకరణలో భాగంగా 100 లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ మార్క్ 1A ని కూడా కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ రెండు కొనుగోళ్ల విలువ రూ. 1.5 లక్షల కోట్లుకు పైగా ఉంది.
తాజాగా కొనబోతున్న 156 హెలికాప్టర్లలో 66 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో, మిగిలిన 90 ఇండియన్ ఆర్మీలో చేరుతాయి. పూర్తి భారతీయ రూపకల్పన, అభివృద్ధి, తయారు చేయబడిన ఆయుధ వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా ప్రచండ్ హెలికాప్టర్లను హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) రూపొందించింది. వీటిని ఎడారులు, ఎత్తైన భూభాగాల్లో సాయుధ దళాల అవసరాలకు అనుగుణంగా పరీక్షించారు.