Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కి ఆ పార్టీకి దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ని త్వరలో వీడుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. బుధవారం ప్రారంభం కానున్న ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మలయాళ భాషా పాడ్‌కాస్ట్ ‘వర్తమానం’లో కేరళలో కాంగ్రెస్ నాయకుడు లేకపోవడాన్ని కూడా ఆయన విమర్శించారు. పాడ్ కాస్ట టీజర్ ఇప్పటికే విడుదలైంది. ‘‘పార్టీ నన్ను కోరుకుంటే నేను పార్టీకి అందుబాటులో ఉంటాను. లేకపోతే నాకు సొంత పనులు ఉన్నాయి. నాకు సమయం గడపడానికి వేరే మార్గం లేదని మీరు అనుకోకూడదు. నాకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి. నా దగ్గర నా పుస్తకాలు, ప్రసంగాలు, ప్రపంచవ్యాప్తంగా చర్చల కోసం ఆహ్వానాలు ఉన్నాయి’’ అని ఆయన చెప్పడం సంచలనంగా మారింది.
Read Also: Hari Hara Veera Mallu: ‘కొల్లగొట్టినాదిరో’ అంటున్న ‘హరి హర వీరమల్లు’!
ఈ వ్యాఖ్యలతో నేరుగా కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వాన్ని ప్రశంసించడం కూడా సంచలనంగా మారింది. కేరళలో కాంగ్రెస్ కూటమి, లెఫ్ట్ కూటమి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నుంచి ప్రశంసలు రావడాన్ని పినరయి విజయన్ సర్కార్ స్వాగతించింది. ఇదే కాకుండా, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీని కూడా ఆయన ప్రశంసించడం కూడా విమర్శలకు దారి తీసింది.
2024 జాతీయ ఎన్నికల్లో కాంగ్రెస్ కాస్త పుంజుకున్నప్పటికీ, తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమైంది. దీనిని ఉద్దేశిస్తూ, కాంగ్రెస్ తన ప్రాబల్యాన్ని విస్తరించుకోవాల్సిన అవసరం ఉందని, లేకుంటే మూడోసారి ప్రతిపక్షంలో కూర్చుంటాని థరూర్ హెచ్చరించారు. కాంగ్రెస్ మద్దతుదారులు మద్దతుతో మాత్రమే గెలవలేమని అన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కి 19 శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయి, వీటితో అధికారం సాధించలేమని, 25-27 శాతం అదనంగా వస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి రాగలదని అన్నారు. తాను వ్యక్తపరిచిన తీరు వల్లే కాంగ్రెస్‌ని వ్యతిరేకించే వారి ఓట్లు కూడా తనకు వచ్చాయని చెప్పారు.