భారతదేశ అత్యున్నత సైనిక కమాండర్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సంచలన నివేదిక సమర్పించింది. లోక్‌సభకు ప్యానెల్ కమిటీ నివేదిక అందజేసింది. బిపిన్ రావత్ మృతికి పైలట్ తప్పిదమే కారణమని ప్యానెల్ కమిటీ తేల్చింది. మానవ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించింది.
డిసెంబర్ 8, 2021లో ఎంఐ-17 హెలికాప్టర్ తమిళనాడులో క్రాష్ అయింది. తమిళనాడులోని కూనూర్ సమీపంలోని అడవుల్లో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్, భార్య మధులికా రావత్‌తో సహా మొత్తం 12 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం జరిగిన మూడు సంవత్సరాలు తర్వాత ప్యానెల్ కమిటీ బుధవారం లోక్‌సభకు నివేదిక అందజేసింది. మానవ తప్పిదం వల్లే ప్రమాదం సంభవించిందని తేల్చి చెప్పింది.
2017 నుంచి 2022 వరకు మొత్తం 34 ఐఏఎఫ్ ప్రమాదాలు జరిగాయని 18వ లోక్‌సభ స్టాండింగ్ కమిటీ నివేదికలో పేర్కొంది. ఎఫ్‌వై 2021-2022 సంవత్సరంలో తొమ్మిది ప్రమాదాలు జరిగాయని.. ఇక డిసెంబర్ 8, 2021లో జరిగినది ‘‘హ్యూమన్ ఎర్రర్ (ఎయిర్‌క్రూ)’’గా ప్యానెల్ తెలిపింది. ప్రమాద సమయంలో వాతావరణ పరిస్థితుల్లో ఊహించని మార్పు కారణంగా మేఘాల్లోకి ఛాపర్ ప్రవేశించి ప్రమాదానికి గురైందని తెలిపింది. ఫ్లైట్ డేటా, కాక్‌పిట్ వాయిస్ రికార్డుల విశ్లేషణ, సాక్షుల విచారణ తర్వాత ఈ నిర్ణయానికి కమిటీ వచ్చింది.
డిసెంబర్ 8, 2021న ఏం జరిగిందంటే..
జనరల్ రావత్, అతని భార్య మధులిక మరియు మరో 12 మంది సాయుధ దళాల సిబ్బందితో కూడిన Mi-17 V5 తమిళనాడులోని కోయంబత్తూర్‌లోని సూలూర్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ స్టాఫ్ సర్వీసెస్ కాలేజీకి బయలుదేరింది. ల్యాండింగ్ చేయడానికి నిమిషాల ముందు కొండలపై కూలిపోయింది. ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది మృతి చెందారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ హెలికాప్టర్ క్రాష్ నుంచి బయటపడిన ఏకైక వ్యక్తి ఆయనే. అయితే అతను కూడా చికిత్స పొందుతూ వారం తర్వాత మరణించాడు.
బిపిన్ రావత్ .. జనవరి 2020 నుంచి డిసెంబర్ 2021లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించే వరకు భారత సాయుధ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా పనిచేశారు. ఆయనకు భారత ప్రభుత్వం 2021లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. బిపిన్ రావత్ ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో 16 మార్చి, 1958న జన్మించారు. 1978 డిసెంబర్‌లో డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్‌లోని పదకొండవ గూర్ఖా రైఫిల్స్ విభాగంలో ఐదవ రెజిమెంట్‌లో చేరారు. డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్‌లో ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌తో సహా శిక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. 2016 డిసెంబర్‌లో కమాండర్ ఇన్ చీఫ్‌గా నియమితులయ్యారు.