Jammu Kashmir: భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల వేళ.. జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదులు భారీ కుట్రకు పన్నాగం పన్నారు. ఈ కుట్రను పసిగట్టిన పోలీసులు, భద్రతా బలగాలు దానిని భగ్నం చేశారు. పుల్వామాలోని తహబ్ క్రాసింగ్ వద్ద రోడ్డుపై ఉగ్రవాదులు అమర్చిన 25 నుంచి 30 కిలోల ఐఈడీని భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయి. పుల్వామాలోని ఆ పేలుడు పదార్థాలను నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లి పేల్చేశారు. ‘పుల్వామాలోని తహబ్ క్రాసింగ్ వద్ద సుమారు 25 నుంచి 30 కిలోల పేలుడు పదార్థాలను భద్రతా దళాలు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ముందస్తుగా గుర్తించడం వల్ల పెను ప్రమాదాన్ని నివారించగలిగాం’ అని జమ్మూకశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఉగ్ర కుట్రలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామన్న ఆయన.. జమ్మూ కశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు.
అంతకు ముందు రోజు ఐఎస్ఐఎస్తో సంబంధాలు ఉన్న ఓ ఉగ్రవాదిని ఉత్తర్ప్రదేశ్ యాంటీ టెరరిస్ట్ స్క్వాడ్ పట్టుకుంది. అతడు స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఐఈడీలు పేల్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు సాబుద్దీన్పై లక్నోలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతడిపై ఐపీసీతోపాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం, ఆయుధాల చట్టానికి సంబంధించి పలు కేసులు నమోదు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకొంటున్న వేళ ఉగ్రదాడులకు ముష్కరులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.