S Jaishankar: యూరోపియన్ యూనియన్ నేతలతో చర్చల కోసం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బ్రస్సెల్స్‌లో ఉన్నారు. ఈ పర్యటనలో పాకిస్తాన్ తీరును మరోసారి ఆయన ఎండగట్టారు. కాశ్మీర్‌లో ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఘర్షణను ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న చర్యలుగా చూడాలని, కేవలం ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యగా చూడొద్దని వెస్ట్రన్ దేశాలకు పిలుపునిచ్చారు. యూరోపియన్ న్యూస్ వెబ్‌సైట్ యూరాక్టివ్‌తో మాట్లాడుతూ, యూరప్‌లో మారుతున్న భౌగోళిక రాజకీయాలు, భవిష్యత్తులో మెరుగైన ఈయూ-భారత్ సంబంధాలపై ఆయన మాట్లాడారు. రష్యా-చైనా మధ్య పెరుగుతున్న సంబంధాల మధ్య, భారత్ ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరుగుతున్నాయి.
Read Also: Russia-Ukraine: రష్యా-ఉక్రెయిన్ మధ్య కీలక పరిణామం.. ఇరు పక్షాల యుద్ధ ఖైదీల విడుదల
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ కింద భారత్ తీసుకున్న చర్యలను రెండు అణ్వాయుధ దేశాల మధ్య సంఘర్షణగా వెస్ట్రన్ మీడియా చిత్రీకరించడాన్ని విమర్శించారు. ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ సైనిక పట్టణం(అబోటాబాద్)లో ఎలా సురక్షితంగా ఉన్నాడు..? అని ప్రశ్నించారు. ఇది కేవలం భారత్ పాకిస్తాన్ సమస్య కాదని, ఉగ్రవాదం గురించి అని, ఉగ్రవాదం చివరకు మిమ్మల్ని కూడా వెంటాడుతుందని హెచ్చరించారు.
ఉక్రెయిన్ యుద్ధంలో పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలకు భారత్ ఎందుకు మద్దతు తెలపలేదని ప్రశ్నించిన నేపథ్యంలో.. భారత్ ఉక్రెయిన్, రష్యాలతో మంచి సంబంధాలు కలిగి ఉందని చెప్పారు. భారత్‌పై పాకిస్తాన్ దాడులు చేసిన సమయంలో వెస్ట్రన్ దేశాలు పాకిస్తాన్‌కి మద్దతు తెలిపిన విషయాన్ని జైశంకర్ గుర్తు చేశారు. స్వాతంత్ర్యం అనంతరం పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్‌లోకి ఆక్రమణదారుల్ని పంపిన సమయంలో ఈ వెస్ట్రన్ దేశాలు పాకిస్తాన్‌కి మద్దతు తెలిపాయని అన్నారు.