Amit Shah: శ్రీరామ నవమి రోజు పశ్చిమ బెంగాల్ హౌరాలో తీవ్ర హింస చెలరేగింది. హౌరాలోని కాజీపారా, శిబ్ పూర్ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే నవమి తర్వాత రోజు కూడా హౌరాలో హింసాత్మక ఘటనలు జరిగాయి. కొంతమంది గుంపు ఇళ్లపై రాళ్ల దాడులు చేశారు. ఇదిలా ఉంటే బెంగాల్ లో పరిస్థితి ఆరాతీయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, రాష్ట్ర బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్లకు ఫోన్ చేశారు. గవర్నర్ నుంచి అమిత్ షా నివేదిక కోరినట్లు తెలుస్తోంది.
Read Also: Minister KTR : మోడీకి ఇష్టం లేకున్నా బెస్ట్ స్టేట్ తెలంగాణ అని చెప్పక తప్పదు
కాజీపారా, శిబ్ పూర్ ప్రాంతాల్లో పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఘర్షణల్లో పాల్గొన్నవారిలో ఇప్పటి వరకు 36 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘర్షణలపై అధికార త్రుణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య విమర్శలు చెలరేగాయి. బీజేపీ కొందరు గుండాలను పంపించి ఘర్షణలకు పాల్పడుతుందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఒక వర్గాన్ని లక్ష్యం చేసుకుని దాడులు చేస్తున్నారంటూ విమర్శించారు. హిందువులు శ్రీరామ నవమిని జరుపుకోండి కానీ రంజాన్ మాసం అయినందు వల్ల ముస్లిం ఏరియాలకు వెళ్లవద్దని ఆమె సూచించారు. ఇదిలా ఉంటే బెంగాల్ లో మమతా బెనర్జీ హిందువులను పట్టించుకోవడం లేదని బీజేపీ ఆరోపించింది.
బీజేపీ ఎంపి లాకెట్ ఛటర్జీ “బెంగాల్‌లో హిందువులు ముప్పులో ఉన్నారు” అని ఆరోపించారు మరియు రాష్ట్ర హోం మంత్రిగా ఉన్ బెనర్జీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. త్రుణమూల్ నేత అభిషేక్ బెనర్జీ రామ నవమిలో తుపాకులతో పాల్గొన్న వారి వీడియోను షేర్ చేశారు. బీజేపీ ఈ అల్లర్లపై ఎన్ఐఏ విచారణ జరపాలని కోల్ కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.