తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ ఐపీఎస్ అధికారిపై వేటు వేసింది కేరళ ప్రభుత్వం… కేరళ కేడర్‌కు ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మణ్ నాయక్‌ను సస్పెండ్ చేశారు సీఎం విజయన్.. నకిలీ పురాతన కళాఖండాలను విక్రయించిన కేసులో నిందితుడిగా ఉన్న యూట్యూబర్ మోన్సన్ మవున్‌కల్‌తో లక్ష్మణ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేలడంతో.. కేరళ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.. గతంలోనూ లక్ష్మణ్ నాయక్‌పై పలు ఆరోపణలు ఉన్నాయని చెబుతున్నారు పోలీసులు.
ఇక, 1997 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మణ్ నాయక్ స్వస్థలం ఖమ్మం జిల్లా.. ప్రస్తుతం ఐజీ కేడర్‌లో సీఎంకు చీఫ్ సెక్యూరిటీగా ఉన్నారు లక్ష్మణ్ నాయక్.. యూట్యూబర్ మోన్సన్ మవున్‌కల్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయంటూ కేరళ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మోసపూరిత కార్యకలాపాలలో మోన్సన్‌కు సహాయం చేయడానికి తన పదవిని ఉపయోగించారనే ఆరోపణలపై హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, పురాతన వస్తువుల వ్యాపారిగా మాయమాటలు చెప్పి ప్రజల నుండి కోట్లాది రూపాయలను మోసం చేసినందుకు మోన్సన్ సెప్టెంబర్‌లో అరెస్ట్ కాగా.. మోన్సన్ మవున్‌కల్‌కి కేరళ మాజీ పోలీసు చీఫ్ డీజీపీ లోక్‌నాథ్ బెహెరా, ప్రస్తుత రాష్ట్ర పోలీస్ చీఫ్ డీజీపీ అనిల్‌కాంత్‌తో సహా రాష్ట్రంలోని అనేక మంది పోలీస్ ఉన్నతాధికారులతో సంబంధం ఉన్నట్లు కొన్ని ఆధారాలు వెలుగుచూశాయి.. దీంతో లక్ష్మణ్‌పై చర్యలకు డీజీపీ కార్యాలయం సిఫారసు చేయడంతో.. చర్యలకు పూనుకుంది ప్రభుత్వం.