India at UN: పాకిస్తాన్ ప్రజలు ఆకలితో, అధిక రేట్లు, ఆహార సంక్షోభంతో అల్లాడుతున్నా అక్కడి ప్రభుత్వానికేం పట్టడం లేదు. వీలుదొరికినప్పుడల్లా భారత్ పై విషాన్ని చిమ్ముతూనే ఉంది. తాజాగా మరోసారి భారత్ లక్ష్యంగా పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో విమర్శించింది. అయితే భారత్ అంతే ధీటుగా పాకిస్తాన్ కు బుద్ది చెప్పింది. రక్షణ కొనుగోళ్లు, కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘనపై భారత్ పై విమర్శలు చేశారు. దీనికి భారత ప్రతినిధి సీమా పుజాని స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చారు.
జీవనోపాధి, స్వేచ్ఛ కోసం పోరాడుతున్న మీ ప్రజల గురించి ముందు పట్టించుకోండని భారత్ సూచించింది. పాక్ తప్పుడు భారత్ పై తప్పుడు ఆరోపణలు చేయడానికి యూఎన్ వేదికను ఉపయోగించుకుంటోందని భారత్ విమర్శించింది. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రజలపై అకృత్యాలను కొనసాగిస్తుందని, దశాబ్ధ కాలంలో 8 వేలకు పైగా మంది కనిపించకుండా పోయారని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, డాక్టర్లు క్రమం తప్పకుండా అదృశ్యం అవుతున్నారని భారత్ విమర్శించింది. పాకిస్తాన్ లో హిందూ, సిక్కులు, ముస్లింలపై అణచివేత కొనసాగుతోందని, సిక్కు, హిందూ బాలికను బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారని, దైవదూషణ పేరుతో క్రైస్తవులను చంపుతున్నారని భారత్, పాక్ తీరును ఎండగట్టింది.
Read Also: RRR: ఒక తెలుగు సినిమాకు స్టాండింగ్ ఒవేషన్.. ఇది కదా గూస్ బంప్స్ మూమెంట్
జమ్మూ కాశ్మీర్ పై టర్కీ ప్రతినిధి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) చేసిన వ్యాఖ్యలపై భారత్ విచారం వ్యక్తం చేసింది. జమ్మూ కాశ్మీర్ భారత అంతర్గత విషయం అని మరోసారి స్పష్టం చేసింది. ఓఐసీ, కాశ్మీర్ గురించి చేసిన సూచనలను భారత ప్రతినిధి సీమా పూజానీ తిరస్కరించారు. జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగంగా ఉంది, ఉంటుంది అని ఆమె అన్నారు. ఈ విషయంలో ఓఐసీని పాక్ హైజాక్ చేస్తుందని అన్నారు.
అంతకుముందు పాక్ విదేశాంగ సహాయమంత్రి హీనారబ్బానీ ఖర్ మాట్లాడుతూ.. భారత్ పేరు ఎత్తకుండా దక్షిణాసియా దేశానికి ఆయుధాలను ఉదారంగా సరఫరా చేస్తున్నారని, ఇది ఈ ప్రాంత స్థిరత్వానికి ప్రమాదం అని ఆరోపించారు. భారత్ జమ్మూ కాశ్మీర్ లో తీవ్ర మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, అక్కడి జనాభాలో మార్పులు తేవడానికి ప్రయత్నిస్తోందని పాక్ ఆరోపించింది.