Himachal Congress Chief Harsh Mahajan Joins BJP: అధ్యక్ష ఎన్నికలు, రాజస్థాన్ రాష్ట్రంలో సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే రాజస్థాన్ సంక్షోభాన్ని ముగించేందుకు పార్టీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్ల మధ్య ఆధిపత్య పోరు రాజస్థాన్ రాష్ట్రాన్ని మరో పంజాబ్ విధంగా చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సమస్యల మధ్య కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Read Also: Lalu Prasad Yadav: పీఎఫ్ఐ లాగే ఆ సంస్థను కూడా నిషేధించాలి.
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హర్ష్ మహాజన్ బుధవారం బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ విజన్ లేని దిక్కులేని పార్టీగా మారిందని ఆయన విమర్శించారు. బీజేపీలో చేరుతూ.. ఆయన కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఢిల్లీలో లాగే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ లో కూడా ‘‘ మా – బేటా’’ పాలన సాగుతోందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు.. ఆమె కుమారుడు విక్రమాదిత్య సింగ్ పార్టీ ఎమ్మెల్యే అని.. వీరభద్ర సింగ్ మరణం తరువాత హిమాచల్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మిగలలేదని ఆయన హర్ష్ మహాజన్ విమర్శలు గుప్పించారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఆయన బుధవారం బీజేపీలో చేరారు. దేశంలో సమర్థవంతమైన, పటిష్టమైన ప్రభుత్వాన్ని అందించనందుకు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో కూడా హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ జెండా ఎగురుతుందని ఆయన అన్నారు. గత నాలుగు దశాబ్ధాలుగా హర్ష్ మహజన్ కు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది. మహాజన్ వంటి క్లీన్ ఇమేజ్ కలిగిన బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని పీయూష్ గోయల్ అన్నారు. డిసెంబర్ లో హిమాచల్, గుజరాత్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ నుంచి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయి ఉన్న నేత బీజేపీలో చేరడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.