Israel-Hamas War: ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ యుద్ధంలో భారత ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నేత కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియాలో విమర్శించారు. పాలస్తీనాపై భారత్ అవలంభిస్తున్న వైఖరి తీవ్రంగా నిరాశపరించిందని అన్నారు. అమాయకులు, నిస్సహాయులైన మహిళలు, పిల్లలు ఎదురుకాల్పుల్లో చిక్కుకున్నప్పుడు బలమైన వైఖరి లేకుండా భారతదేశం ఎలా నిలబడగలదు..? ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్యపై భారత ప్రభుత్వం వైఖరి తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు.
ఈ వివాదంపై మొదటి నుంచి భారత్ విధానం భిన్నంగా ఉందని ఆయన ఆరోపించారు. భారతదేశం పాలస్తీనా వాదానికి మద్దతు ఇస్తుందని, వారి హక్కుల కోసం పోరాడిందని కేసీ వేణుగోపాల్ ఫేస్‌బుక్ లో మలయాళంలో పోస్టు చేశారు. దురాక్రమణ, ప్రతిదాడుల విషయంలో భారత్ తీవ్రంగా ఖండించేది, అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుత భారత వైఖరి యుద్ధం ముగించడానికి సరిపోదని అన్నారు. ఇంతే కాకుండా గతంలో మాదిరిగా ఈ అంశంపై ప్రభుత్వం అభిప్రాయాలను గౌరవంగా, మర్యాదగా తెలియజేయాలని ఆయన కోరారు.
Read Also: Dabur India: డాబర్ ఉత్పత్తులపై యూఎస్, కెనడాల్లో కేసులు.. క్యాన్సర్‌కి కారణమవుతున్నాయని ఆరోపణలు..
ఇజ్రాయిల్, పాలస్తీనా అనే తేడా లేకుండా రెండు దేశాలు అంతర్జాతీయ మానవతా చట్టాలకు కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. ఇజ్రాయిల్ లో మహిళలు, పిల్లలు, బలహీన పౌరులపై హమాస్ చేసిన చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించలేమని, అయితే అలాంటి పరిస్థితులకు దారి తీసిన చారిత్రక నేపథ్యాన్ని పరిశీలించడం చాలా అవసమని ఆయన అన్నారు. గాజాను పూర్తిగా తుడిచపెట్టేందుకు ఇజ్రాయిల్ చేస్తున్న క్రూరమైన దాడులకు కొన్ని దేశాలు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని, వాటి వెనక భారత్ నిలబడవద్దని కాంగ్రెస్ ఎంపీ కోరారు.
ఈ యుద్ధం ముగించి, శాంతి నెలకొల్పేందుకు భారత్ నాయకత్వం వహించాలని వేణుగోపాల్ అన్నారు. ప్రపంచం భారత్ నుంచి ఆశించే పరిణితి చెందిన గౌరవప్రదమైన వైఖరని వేణుగోపాల్ అన్నారు. అంతకుమందు ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై కేంద్ర వైఖరిని ఉద్దేశిస్తూ ఎన్సీపీ నేత శరద్ పవార్ ఆదివారం విమర్శలు గుప్పించారు.