హిజాబ్ వివాదంపై విచారణను రేపటికి వాయిదా వేసింది కర్ణాటక హైకోర్టు. హిజాబ్ కాంట్రావర్సీపై కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. హిజాబ్ ను అనుమతించాలా లేదా అనేది తేల్చే అంశాన్ని కాలేజీ కమిటీలకు వదిలేయడం ఇల్లీగల్ అన్నారు పిటిషనర్ల తరపు అడ్వోకేట్ దేవదత్ కామత్. కేంద్రీయ విద్యాలయాల్లో కూడా ముస్లిం విద్యార్థినులు తలకు స్కార్ఫ్ కట్టుకునేందుకు అనుమతిస్తోన్న విషయం కోర్టుకు తెలిపారు. కర్ణాటకలో ముస్లిం అమ్మాయిలు కొత్తగా యూనీఫామ్ కావాలని డిమాండ్ చెయ్యడం లేదని, ప్రభుత్వం ఆదేశాల మేరకు వేసుకుంటున్న యూనీఫామ్ రంగులోనే హిజాబ్ లు ధరిస్తామని మనవి చేస్తున్నారని ముస్లిం అమ్మాయిల తరుపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. హిజాబ్ ను నిషేధించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 25కు విరుద్దమన్నారు. అది న్యాయ సమీక్షకు నిలబడదని చెప్పారు. హిజాబ్ ధరించి ముస్లిం అమ్మాయిలు స్కూళ్లకు హాజరయ్యేలా అనుమతించాలని కోర్టును కోరారు.
Read Also: Movie Tickets: ఇంత అవమానమా..? చిరంజీవి చేతులు జోడించి వేడుకోవాలా..?
అయితే, హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరా… కాదా అన్నది తేల్చాలని అభిప్రాయపడింది ప్రభుత్వం. ఖురాన్ లో చెప్పిన మతపరమైన అంశాలన్నీ పాటించాలా అని దేవదత్ కామత్ ను ప్రశ్నించింది హైకోర్టు. అయితే, అన్నీ పాటిస్తున్నారా, లేదా అనే విషయం కచ్చితంగా చెప్పలేమన్నారు పిటిషనర్ల తరపు న్యాయవాది. ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం ముఖానికి స్కార్ఫ్ ధరించడం తప్పనిసరి అని కామత్ చెప్పారు. రెండు పక్షాల వాదనలు విన్న హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. హిజాబ్ లు వేసుకుని కాలేజ్ కు వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారణ చేసిన కర్ణాటక హైకోర్టు హిజాబ్ లు, కాషాయం కండువాలు వేసుకుని ఎవ్వరూ కూడా విద్యాసంస్థల్లో అడుగు పెట్టకూడదని ఇటీవల మద్యంతర ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, విద్యా సంస్థల్లో ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించే విషయంలో కర్ణాటకలో వివాదం కంటిన్యూ అవుతోంది. ఇవాళ్టి నుంచే కర్ణాటకలో స్కూళ్లు ప్రారంభమయ్యాయి. తాము ఈ అంశాన్ని తేల్చేవరకు మతపరమైన వస్త్రాలు ధరించకుండా స్కూళ్లకు వెళ్లాలని గత వారం విద్యార్థులకు సూచించింది హైకోర్టు. అయితే ఇవాల స్కూళ్లు మొదలు కాగా… వివాదానికి కేంద్రంగా ఉన్న ఉడుపి జిల్లాలో ఎవరూ కూడా హిజాబ్ ధరించి స్కూళ్లకు రాలేదు. ఉడుపి జిల్లాలో 144 సెక్షన్ విధించారు. కానీ మాండ్యలో ఓ స్కూల్ దగ్గర టీచర్లు, పేరెంట్స్ కు ఆర్గ్యుమెంట్ జరిగింది. బురఖా వేసుకుని వచ్చిన స్టూడెంట్స్ ను స్కూళ్లోకి అనుమతించలేదు టీచర్లు.