Hemant Soren: ల్యాండ్ స్కామ్ కేసులో ఈడీ జనవరిలో హేమంత్ సోరెన్‌ని అరెస్ట్ చేసింది. అయితే, ఇటీవల జార్ఖండ్ హైకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. ఆరోపించిన విధంగా హేమంత్ సోరెన్ నేరానికి పాల్పడలేదని హైకోర్టు వ్యాక్యానించింది. ఇదిలా ఉంటే ఈడీ అరెస్టుకు ముందు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన హేమంత్ సోరెన్, ఇప్పుడు మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టడానికి రెడీ అవుతున్నారు. సోరెన్ అరెస్టు తర్వాత చంపై సోరెన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. సీఎంగా హేమంత్ సోరెన్‌ని కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు ఎన్నుకున్నాయి.
Read Also: BJD: ఒకప్పటి బీజేపీ మిత్రుడు.. ప్రతిపక్షంతో చేతులు కలిపిన నవీన్ పట్నాయక్ పార్టీ..
అయితే, ప్రస్తుతం మళ్లీ హేమంత్ సోరెన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి మార్పు గురించి ఇండియా కూటమి ఎమ్మెల్యేలు, నేతలు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత మార్పు జరగబోతున్నట్లు తెలుస్తోంది. జనవరిలో అరెస్టైన హేమంత్ సోరెన్ జూన్ 28 వరకు ఐదు నెలల పాటు బిర్సా ముండా సెంట్రల్ జైలులో ఉన్నారు.
ఇదిలా ఉంటే, చంపై సోరెన్ సాయంత్రం 8 గంటలకు రాజీనామా చేస్తారని తెలుస్తోంది. చంపై సోరెన్ తనను మార్చడం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజీనామా తర్వాత జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చంపై నియమించవచ్చని తెలుస్తోంది. జేఎంఎం లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో చంపై మాట్లాడుతూ, తాను దీనిని అవమానంగా భావిస్తున్నారని చెప్పినట్లు తెలుస్తోంది.