BJD: గత 10 ఏళ్లుగా మోడీ ప్రభుత్వానికి అండగా నిలిచిన నవీన్ పట్నాయక్ ‘‘బిజూ జనతాదళ్(బీజేడీ)’’ పార్టీ బీజేపీకి షాక్ ఇచ్చింది. రాజ్యసభలో పలు బిల్లులను క్లియర్ చేసేందుకు బీజేడీ ఎంపీలు చాలా సార్లు బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా ఓటేశారు. అయితే, ప్రస్తుతం బీజేడీ, కషాయానికి దూరంగా జరుగుతోంది. ఈ రోజు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. ఈ సమయంలో రాజ్యసభలో బీజేడీకి ఉన్న 9 మంది ఎంపీలు ప్రతిపక్షాలతో చేతులు కలిపారు. వీరు ప్రతిపక్షం వాకౌట్ చేసిన సందర్భంలో వారితోనే ఉన్నారు.
యూపీఏ హయాంలో ఈ వ్యక్తులు ప్రభుత్వాన్ని ఆటో పైలట్, రిమోట్ కంట్రోల్ పాలన చేశారని ప్రధాని మోడీ, సోనియా గాంధీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. వారికి పనిచేయడంపై నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని ప్రతిపక్ష ఎంపీలు జోక్యం చేసుకోవడానికి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ అనుమతించలేదు. దీంతో ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వీటితో పాటు బీజేడీ ఎంపీలు ఉన్నారు.
Read Also: Hathras stampede: హత్రాస్ తొక్కిసలాటపై రష్యా అధినేత పుతిన్ సంతాపం..
గతేడాది రాజ్యసభలో వివాదాస్పద బిల్లులను క్లియర్ చేయడంలో నవీన్ పట్నాయక్ పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు కోసం బీజేడీ ప్రయత్నించి విఫలమైంది. ఎన్నికల్లో బీజేపీ ఒడిశాలో సంచలన విజయం సాధించింది. 24 ఏళ్ల పాటు ఒడిశాను పాలించిన నవీన్ పట్నాయక్ శకానికి ముగింపు పలించింది. రాష్ట్రంలోని మొత్తం ఎంపీ స్థానాలను బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో అధికారాన్ని ఏర్పాటు చేసింది.
గతంలో పలు బిల్లులు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక హోదా రద్దు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం, గ్రవాద నిరోధక చట్టం UAPA మరియు సమాచార హక్కు చట్టానికి సవరణలు చట్టానికి బీజేడీ మద్దతు లభించింది. అయితే, ఒడిశాలో ఓటమి తర్వాత బీజేడీకి రాజ్యసభలో ఉన్న 09 మంది సభ్యులు బలమైన ప్రతిపక్షంగా ఉండాలని నవీన్ పట్నాయక్ సూచించారు.