Helicoptor crashes near Uttarakhand’s Kedarnath: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కేదార్ నాథ్ కు రెండు కిలోమీటర్ల దూరంలో గరుడ్ చట్టిలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్ తో సహా మొత్తం ఏడుగురు మరణించారు. గుప్తకాశీ నుంచి కేదార్ నాథ్ వెళ్తున్న సమయంలో సాంకేతిక లోపం, వాతావరణ కారణాల వల్ల హెలికాప్టర్ క్రాష్ అయినట్లు తెలుస్తోంది. ఆర్యన్ ఏవియేషన్ హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేదార్ నాథ్ కు వెళ్తోంది. హెలికాప్టర్ కూలిన వెంటనే మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న అందరూ చనిపోయారు. చనిపోయిన వారిని పూర్వ రామానుజ్, కృతి బ్రార్, ఉర్వి, సుజాత, ప్రేమ్ కుమార్, కాలా, పైలట్ అనిల్ సింగ్‌లుగా గుర్తించారు.
Read Also: Nagpur Panchayat Elections : నాగపూర్ జిల్లాలో బీజేపీకి షాక్.. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి
కేదార్ నాథ్ తీర్థయాత్ర ప్రాంతంలో తరుచుగా వాతావరణ పరిస్థితులు మారుతూ ఉంటాయి. దీంతోనే హెలికాప్టర్ క్రాష్ అయినట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది ప్రయాణికులు గుప్తకాశీ నుంచి కేదార్ నాథ్ వెళ్లేందుకు కష్టతరమైన కాలినడక మార్గాన్ని అనుసరిస్తుంటారు. అయితే ఆర్థిక స్థోమత ఉన్న వారు మాత్రం హెలికాప్టర్ ద్వారా కేదార్ నాథ్ వెళ్తుంటారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. ఆర్యన్ ఏవియేషన్ కు చెందిన బెల్ 407 హెలికాప్టర్ వీటీ-ఆర్పీఎన్ మార్గం మధ్యలో కూలిపోయిందని తెలిపింది.
ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేదార్ నాథ్ హెలికాప్టర్ ప్రమాదం బాధకరమని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదంపై బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఎస్డీఆర్ఎఫ్ టీములు ఘటన స్థలంలో సహాయక చర్యలను ప్రారంభించాయి. దట్టమైన పొగమంచు కారణంగా హెలికాప్టర్ కొండను ఢీకొని ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.