DMK: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీకి చెందిన నాయకుడి భార్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యవహారం ఇప్పుడు అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే మధ్య విమర్శలకు దారి తీసింది. తమిళనాడుకు చెందిన ఒక యువతి, తన భర్త తనపై హింస, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించింది. నిందితుడైన 40 ఏళ్ల వ్యక్తికి అధికార డీఎంకేతో సంబంధాలు ఉన్నాయి. ‘‘అతని పని 20 ఏళ్ల అమ్మాయిలను రాజకీయ నాయకుల వద్ద పడుకోబెట్టడం, అతను నన్ను పిచ్చి కుక్కలా కొరుకుతాడు’’ అంటూ ఆరోపణలు చేసింది.
అరక్కోణం జిల్లాకు చెందిన 20 ఏళ్ల కాలేజ్ విద్యార్థిని అయిన సదరు మహిళ, తన భర్త దేవసేయల్‌పై ఆరోపణలు చేసింది. తన భర్త డీఎంకే యువజన విభాగం డిప్యూటీ సెక్రటరీగా చెప్పుకుంటూ, పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన కుటుంబ సభ్యుల్ని కాల్చి వేస్తానని బెదిరించినట్లు చెప్పింది. ‘‘కాలేజ్‌కి వెళ్లే దారిలో నాపై దాడి చేసి, ఫోన్ పగలగొట్టాడు, నువ్వు ఫిర్యాదు చేసిన పోలీసులు నాకే సాయం చేస్తారు’’ అని చెప్పినట్లు బాధిత మహిళ ఆరోపించింది.
Read Also: Looting bride: 25 మందిని పెళ్లి చేసుకున్న కిలాడీ లేడీ.. దోచుకుని పారిపోవడం ఇమె స్టైల్..
‘‘20 ఏళ్ల అమ్మాయిలను రాజకీయ నాయకులతో పడుకోబెట్టడం అతని పని… అతనిపై ఎప్పుడూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నేను ఫిర్యాదు చేసినప్పుటి నుంచి అతను నన్ను ముక్కలుగా నరికివేస్తానని బెదిరించాడు. అతను నన్ను కారులో హింసించాడు,అతను చూపించిన వ్యక్తులతో పడుకోమని చెప్పాడు… నేను నా ఇంటికే పరిమితమయ్యాను, నేను నా పరీక్షలు కూడా రాయలేకపోయాను’’అని మహిళ చెప్పింది. తన భర్త అందరి ముందు వేధిస్తున్నాడని, డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ చర్యలు తీసుకోవాలని కోరింది. చర్యలు తీసుకోకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించింది.
అయితే, ఈ వ్యవహారం రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య ఆరోపణలకు కారణమైంది. నిందితుడైన దేవసేయల్‌ని డీఎంకే కాపాడుతోందని అన్నాడీఎకేం ఆరోపించింది. అధికార పార్టీలో ఉన్న సంబంధాల కారణంగా పోలీసులు మొదట కేసు నమోదు చేయలేదని, స్థానిక అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఎస్ రవి కలుగచేసుకోవడంతో పోలీసులు మహిళ ఫిర్యాదును తీసుకున్నారని అన్నాడీఎంకే చీఫ్ పళని స్వామి అన్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, తన భర్తకు తమిళనాడు స్కూల్ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్బిల్ మహేష్ పొయ్యమోళితో సంబంధాలు ఉన్నాయని మహిళ పేర్కొంది.
ప్రాథమిక విచారణలో లైంగిక వేధింపులకు కారణమని సూచించే ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు. అధికార డీఎంకే పార్టీ ఈ ఆరోపణలపై స్పందిస్తూ.. దోషులపై చర్యలు తీసుకుంటామని, పోలీసుల దర్యాప్తును బట్టి పార్టీ అంతర్గత చర్యలు తీసుకుంటుందని తెలిపింది.