Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ శనివారం రాయ్ పూర్ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ ప్లీనరీ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల నుంచి విరమణ చేయడాన్ని ప్రస్తావించారు. భారత్ జోడో యాత్ర పార్టీకి కీలక మలుపు అని ఆమె అన్నారు. నా ఇన్నింగ్స్ భారత్ జోడో యాత్రతో ముగిస్తుంది అని అన్నారు. భారత ప్రజలు సామరస్యం, సహనం మరియు సమానత్వాన్ని కోరుకుంటున్నారని యాత్ర నిరూపించిందని అన్నారు. ఇది ప్రజలు, మా పార్టీ మధ్య సంబంధాలను పునరుద్ధరించింది అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజలతో నిలబడి, వారి కోసం పోరాడటానికి సిద్ధంగా ఉందని ఇది మాకు చూపించింది అని చెప్పారు.
Read Also: Nalgonda Crime: నవీన్ హత్య కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు.. వెలుగులోకి సంచలన విషయాలు
జోడో యాత్ర కోసం కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తలకు ముఖ్యంగా రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.ప్రస్తుత సమయం దేశానికి, కాంగ్రెస్ కు చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ పాలన ప్రతీ సంస్థను కనికరం లేకుండా అణచివేసి, స్వాధీనం చేసుకున్నారని దుయ్యబట్టారు. కొంతమంది ఆర్థికవేత్తలకు అనుకూలంగా ఉండటం ద్వారా ఆర్థిక నాశనానికి కారణం అయ్యారని ఆరోపించారు. తోటి భారతీయులపై విద్వేష మంటలు వ్యాపించ చేస్తున్నారని అన్నారు.
మైనారిటీలు, దళితులు, ఆదివాసీలు, మహిళలకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తోందని, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తోందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని.. అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం కోసం పోరాడతామని అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన సమయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని ఓడించే లక్ష్యాన్ని సాధించాలని శ్రీమతి గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు. చత్తీస్ గఢ్ రాయపూర్ వేదికగా పార్టీ 85వ ప్లీనరీ సెషన్స్ జరుగుతున్నాయి. 2024 ఎన్నికల ముందు పార్టీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.