GVL Narasimha Rao: బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు కీలక బాధ్యతలు అప్పగించింది భారతీయ జనతా పార్టీ.. దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర బడ్జెట్ ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాది రాష్ట్రాల బీజేపీ “సమన్వయకర్త” (కోఆర్డినేటర్)గా రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును కేంద్ర నాయకత్వం నియమించింది. కేంద్ర బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రాలకు జరిగిన కేటాయింపులు, వాటి వల్ల వివిధ సామాజిక వర్గాలకు కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతలను జీవీఎల్‌కు బీజేపీ అప్పగించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలకు ఒనగూడే ప్రయోజనాలను వివరించే కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నాయకత్వం ఆయనకు నిర్దేశించింది.
Read Also: Amazon Layoffs: 16,000 మంది ఉద్యోగులకు అమెజాన్ లేఆఫ్.. వీరి స్థానంలో AI..
అంటే, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ సమన్వయకర్తగా జీవీఎల్ నరసింహారావు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కేంద్ర, రాష్ట్ర పార్టీ విభాగాలను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ప్రజలకు బడ్జెట్ అంశాలను వివరించే కీలక పాత్రను ఆయన పోషించనున్నారు. ప్రత్యేకంగా తెలంగాణలో జరగనున్న పట్టణ, నగర పాలక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులు, వివిధ సామాజిక వర్గాలకు కలిగే లాభాలపై విస్తృత ప్రచారం చేపట్టనున్నట్లు సమాచారం.
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దక్షిణాది రాష్ట్రాల వ్యాప్తంగా బడ్జెట్‌పై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలకు జీవీఎల్ సారథ్యం వహించనున్నారు. పట్టణాలు, నగరాల్లోని వివిధ వర్గాలతో సమావేశాలు, చర్చా వేదికల ద్వారా బడ్జెట్‌లోని ప్రధాన అంశాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత, రైతాంగానికి మద్దతు వంటి అంశాలను ప్రజలకు వివరించనున్నారు. కేంద్ర బడ్జెట్ అంశాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లే దిశగా జీవీఎల్ నరసింహారావు నియామకం బీజేపీ వ్యూహాత్మక అడుగుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.