గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బీలోని ఉప్పు కర్మాగారం గోడ కూలి 12 మంది కూలీలు దుర్మరణం చెందారు. హల్వాద్ జీఐడీసీ సాగర్ సాల్ట్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ సంఘటనలో 12 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. బస్తాల్లో ఉప్పు నింపే పనులు జరుగుతుండగా.. ఉన్నట్టుండి ఫ్యాక్టరీ ప్రహారీ గోడ కూలింది. కాగా.. మరణించిన వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. గోడ కింద మరింత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 20 మంది వరకు గోడ కింద శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది గోడ కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమైంది. మోర్బీ జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర సిబ్బంది దగ్గరుండి సహయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్థానిక యంత్రాంగం జేసీబీల సాయంతో గోడ కింద చిక్కుకున్నవారిని రెస్క్యూ చేస్తోంది.
ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మోర్బిలో ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఒక్కొక్కరికి రూ.2 లక్షలతో పాటు గాయపడ్డవారికి రూ.50,000 పరిహారం అందిస్తామని వెల్లడించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ మోర్బీ ఘటనలో మరణించిన ప్రతీ కార్మికుడి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్కోక్కరికి రూ. 4 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని రాష్ట్ర మంత్రి బ్రిజేష్ మోర్జా అన్నారు.
ఇటీవల ఢిల్లీలోని ముండ్కా అగ్ని ప్రమాదం మరవక ముందే గుజరాత్ మోర్బీలో మరో ప్రమాదం చోటు చేసుకోవడంతో అమాయకులైన కార్మికులు మరణించారు. ఇటీవల ముండ్కా అగ్ని ప్రమాదంతో 29 మంది మరణించిన సంగతి తెలిసిందే.