Governor vs CM in Kerala: కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ గా తయారైంది అక్కడి పరిస్థితి. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం వివాదం కేరళ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు సోమవారం ఉదయం 11.30లోగా వైదొలగాలని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ రాజకీయ దుమారం ఏర్పడింది. ఈ వివాదాస్పద ఆదేశాలను విచారించేందుకు కేరళ హైకోర్టు ఈ సాయంత్రం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని గవర్నర్ ఖాన్ చెబుతున్నారు. అయితే సీఎం పినరయి విజయన్ రాష్ట్రంలో విద్యావ్యవస్థను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గవర్నర్ సంఘ్ పరివార్ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం, విద్యాపరంగా స్వతంత్య్రంగా ఉండాల్సిన యూనివర్సిటీల అధికారాలను గవర్నర్ చర్యలు అతిక్రమించడమే అవుతాయని ఆయన ఆరోపించారు.
Read Also: Samsung India: ‘శామ్‌సంగ్ ఇండియా’ ఖుషీ ఖుషీ. గత ఐదేళ్లలో ఎప్పుడూలేనంత..
కేరళ ప్రభుత్వం వివిధ యూనివర్సిటీలకు సొంతంగా వైస్ ఛాన్సలర్లను నియమిస్తున్న నేపథ్యంలో గవర్నర్, ప్రభుత్వానికి మధ్య వివాదం ప్రారంభం అయింది. వైస్ ఛాన్సలర్ల నియామకం అనేది గవర్నర్ అధికారాల్లో ఒకటి అని ఆరీఫ్ మహ్మద్ ఖాన్ చెబుతున్నారు. కేరళ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కన్నూర్ యూనివర్సిటీ, ఏపీజే అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్శిటీ, శ్రీ శంకరాచార్య సంస్కృత యూనివర్శిటీ, కాలికట్ యూనివర్శిటీ, తుంచత్ ఎజుతచ్చన్ మలయాళ యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేయాలని గవర్నర్ ఆదేశాాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వామపక్ష విద్యార్థి విభాగాలు వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
గవర్నర్ చర్య ఏకపక్షంగా ఉందని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి అన్నారు. యూనివర్సిటీల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను నియమించాలని భావిస్తున్నారని.. విద్యావ్యవస్థలోకి హిందుత్వ భావజాలాన్ని జోడించాలని ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. గవర్నర్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని అన్నాను. గవర్నర్ పని రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడటం కానీ.. ప్రభుత్వాన్ని సంక్షోభంలో పడేయడం కాదని సీఎం పినరయి విజయన్ అన్నారు.