డీఏపీ ధరలు పెరుగుతూ రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.. అయితే, కేంద్రం ప్రభుత్వం ఇవాళ రైతులకు అనుకూలంగా చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది.. డీఏపీ ఎరువు ధరలను భారీగా పెంచేందుకు నిర్ణయించిన మోడీ సర్కార్.. అదే సమయంలో.. పెరిగిన భారాన్ని రైతులపై మోపకుండా సబ్సిడీ రూపంలో తామే భరిస్తామని పేర్కొంది. డీఏపీపై ప్రభుత్వ సబ్సిడీని కేంద్ర సర్కార్ 140 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. అంటే.. ఇప్పటి వరకు డీఏపీ బ్యాగ్ ధర రూ. 1,700 ఉండగా.. రూ. 500 సబ్సిడీతో రూ. 1,200కి డీఏపీ లభ్యం అవుతుంది.. కానీ, ఇప్పుడు డీఏపీ ధర రూ.2400కు చేరింది.. అయితే, రైతులు చెల్లించాల్సింది మాత్రం.. అదే రూ.1200లు.. మిగతా రూ. 1,200 కేంద్రం సబ్సిడీ రూపంలో ఇస్తుంది. రైతులకు డీఏపీకి రూ.1200 చెల్లిస్తే.. మిగతా రూ.1,200లను కేంద్రం నేరుగా కంపెనీలకు చెల్లించనుంది. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై రూ. 14,775 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా వేస్తున్నారు.
ఎరువుల ధరలపై ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.. అంతర్జాతీయంగా ఫాస్పోరిక్ ఆమ్లం, అమ్మోనియా మొదలైనవాటి ధరలు పెరగడం వల్ల ఎరువుల ధరలు పెరుగుతున్నాయని చర్చించారు. అయితే, రైతులు పాత ధరలకే రువులు పొందాలని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ.. డీఏపీ ఎరువుల రాయితీని ఒక్కో సంచికి రూ .500 నుంచి రూ .1,200 కు పెంచాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇది 140 శాతం పెరుగుదల అని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటీవల డీఏపీలో ఉపయోగించే ఫాస్పోరిక్ ఆమ్లం, అమ్మోనియా మొదలైన వాటి ధరలు అంతర్జాతీయంగా 60 శాతం నుండి 70 శాతం వరకు పెరిగాయి. కాబట్టి, డీఏపీ బ్యాగ్ ధర ఇప్పుడు రూ .2,400గా చేరింది.. పాత సబ్సిడీ ప్రకారం.. ఎరువుల కంపెనీలు రూ .500 సబ్సిడీని పరిగణనలోకి తీసుకున్న తర్వాత రూ .1,900కు బస్తా అమ్మాల్సి ఉంటుంది.. కానీ, ఇవాళ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రైతులకు రూ .1,200కే డిఎపి బ్యాగ్ లభించనుంది.