Arvind Kejriwal: ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి ఖలిస్తానీ ఉగ్రవాద గ్రూపుల నుంచి ప్రాణాపాయం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చాయి. అయితే, దీనిపై కేజ్రీవాల్ కీలక కామెంట్స్ చేశారు. ఫిబ్రవరి 5న జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. ‘‘దేవుడే నన్ను రక్షిస్తాడు’’ అని అన్నారు. దేవుడు అనుమతించిన కాలం తాను జీవించాలని నిర్ణయించుకున్నానని అన్నారు.
Read Also: Siddaramaiah: ముడా కేసులో సీఎంకు చుక్కెదురు.. దర్యాప్తు కొనసాగించాలని లోకాయుక్తకు హైకోర్టు ఆదేశం
నామినేషన్ దాఖలు చేయడానికి ముందు, కేజ్రీవాల్ కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ప్రాచీన హనుమాన్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. ‘‘దేవుడిచే రక్షించబడిన వారిని ఎవరూ చంపలేరు’’ అని తనకు ఉన్న ముప్పు గురించి అన్నారు. ‘‘దేవుడు తన జీవితం ముగిసిన రోజు, ఫోన్ చేస్తాడు’’ అని చెప్పారు. కేజ్రీవాల్‌కి ముప్పు ఉందనే ఇంటెలిజెన్స్ నివేదికలు రావడంతో ఆయన భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తామని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.
పంజాబ్‌లో చివరిగా గుర్తించిన ఇద్దరు, ముగ్గురు ఖలిస్తానీ కార్యకర్తలతో హిట్ స్వ్కాడ్ ఏర్పడినట్లు, వారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్‌ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని నిఘా నివేదికలు సూచిస్తున్నాయి. ఢిల్లీ, పంజాబ్‌లలో సామరస్యాన్ని, శాంతిభద్రతలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఉన్న ఈ కుట్ర వెనుక పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) మద్దతు ఉన్న ఖలిస్తాన్ గ్రూప్ ఉందని నిఘా సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతం కేజ్రీవాల్‌కి Z-ప్లస్ సెక్యూరిటీ, పైలట్, ఎస్కార్ట్ టీమ్స్ రక్షణగా ఉన్నాయి.