Goa Politics: గోవాలో కాంగ్రెస్ దాదాపుగా ఖాళీ అయిపోయింది. ఈ ఏడాది మొదట్లో గోవాలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి చతికిలపడింది. ఇదిలా ఉంటే గోవాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం ఎమ్మెల్యేలు దిగంబర్ కామత్, మైఖేల్ లోబో, డెలిలా లోబో, కేదార్ నాయక్, రాజేష్ ఫాల్దేశాయ్, సంకల్ప్ అమోంకర్, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్, అలెక్సో సిక్వేరాలు కాంగ్రెస్ శాససభా పక్షం సమావేశంలో తీర్మాణం చేసి బీజేపీ పార్టీలో చేరారు.
Read Also: Renu Desai: రవితేజ కోసం రంగంలోకి పవన్ మాజీ భార్య.. లక్ కలిసొచ్చేనా..?
ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎన్నికల్లో గోవాలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రమోద్ సావంత్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ పార్టీ 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది బీజేపీలో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సదానంద్ తనవాడే నేతృత్వంలో సోమవారం ఉదయం ప్రధానిని కలవనున్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలు రాత్రికి ఢిల్లీకి వెళ్తారని.. మరో ఇద్దరు వారితో చేరుతారని గోవా బీజేపీ వెల్లడించింది. బీజేపీ వర్గాల ప్రకారం ప్రధానితో పాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలుస్తారని తెలుస్తోంది. అయితే వీరిని కలుస్తారా..? లేదా..? అనేదానిపై ఇంకా స్పష్టత లేదు.