Renu Desai: బద్రి సినిమాతో వెండితెరకు పరిచయమై, పవన్ కళ్యాణ్ భార్యగా ప్రజల మనస్సులో చోటు సంపాదించుకొని.. వదినమ్మ అని ఇప్పటికి పవన్ ఫ్యాన్స్ తో ప్రేమగా పిలిపించుకొంటుంది రేణు దేశాయ్. విడాకుల తరువాత కూడా భర్తను ఒక స్నేహితుడిలా చూస్తూ, పిల్లలను భర్తకు, భర్త కుటుంబానికి దగ్గరగా ఉంచుతున్న రేణు వ్యక్తిత్వం అంటే పవన్ అభిమానులకే కాదు ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఇక ఇటీవల రేణు సినిమాలో రీ ఎంట్రీ ఇవ్వడానికి కష్టపడుతుందని వార్తలు వినిపించాయి. బుల్లితెరపై ఒక షోకు జడ్జిగా వ్యవహరించి మెప్పించిన రేణు.. రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్ర పోషిస్తుందని ఎప్పటి నుంచో వార్తలు గుప్పుమంటున్న విషయం విదితమే. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయేసరికి నిజమో కాదో అని అభిమానులందరూ డైలమా లో పడ్డారు. కాగా, ఎట్టకేలకు ఈ వార్తను నిజం చేస్తూ రేణు అధికారికంగా ఈ విషయాన్నీ ప్రకటించింది. స్టూవర్టుపురం గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథగా తెరకెక్కుతున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’.
వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో తాను భాగమైనందుకు సంతోషంగా ఉందని రేణు తెలిపింది. ” హేమలత లవణం గారి లాంటి స్పూర్తిదాయకమైన పాత్రలో నేను చేయగలను అని నన్ను నమ్మిన దర్శకుడు వంశీ కృష్ణకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడంలేదని” చెప్పుకొచ్చింది.. హేమలత లవణం.. టైగర్ నాగేశ్వరరావు అక్క.. ఆమె పాత్రలోనే రేణు కనువిందు చేయనుంది. ఇక రవితేజ విషయానికొస్తే క్రాక్ సినిమా తప్ప ఇప్పటివరకు మాస్ మహారాజా ఒక్క హిట్ అందుకున్నది లేదు.. దీంతో ఈసారి వచ్చే సినిమాలపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి అంటేశాయి. మరి రేణు లక్ ఏమైనా ఈ సినిమాకు కలిసొచ్చి హిట్ అందుకొంటుందేమో చూడాలి.