CM Himanta: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ఉప ప్రతిపక్ష నేతగా ఉన్న గౌరవ్ గొగోయ్ టార్గెట్‌గా అస్సా సీఎం హిమంత బిశ్వ సర్మ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. గొగోయ్ 15 రోజుల పాటు పాకిస్తాన్‌లో బస చేసినట్లు ఆయన ఆరోపించారు. తాజాగా, మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గొగోయ్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్‌కి పాకిస్తాన్ సైన్యంతో మంచి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో హిమంత మాట్లాడుతూ.. కోల్బర్న్ భారత్- పాకిస్తాన్ మధ్య 19 సార్లు ప్రయాణించారని చెప్పారు.
‘‘ఆమె పాకిస్తాన్‌లో పని చేసి, ఆ తర్వాత ఢిల్లీకి వచ్చి, ఒక ప్రభుత్వేతర సంస్థలో పనిచేస్తున్నారు. కానీ, పాకిస్తాన్ నుంచి జీతం తీసుకుంటూనే ఉన్నారు’’ అని సీఎం ఆరోపించారు. గొగోయ్ 15 రోజులు పాకిస్తాన్‌లో ఉంటే, మొదటి 07 రోజులు ఆయన భార్య అతడితో ఉందని, ఆ తర్వాత ఆమె భారత్ వచ్చినప్పటికీ, గొగోయ్ పాకిస్తాన్ లోనే ఉన్నారని అన్నారు. గొగోయ్ పాకిస్తాన్లో ఏం చేశాడు, పాక్ సైన్యానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించాడా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలని అని హిమంత అన్నారు.
ప్రధాని మోడీ పాకిస్తాన్ పర్యటన గురించి ప్రశ్నించే వారు, ఆయన అధికార హోదాలో అక్కడి వెళ్లారని గుర్తుంచుకోవాలని అన్నారు. అయితే, గొగోయ్ ఏ అధికార హోదాలో అక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. పాక్ పర్యటన సందర్భంగా ఆయనకు పోలీసులు సమన్లు జారీ చేశారని హిమంత చెప్పారు. పాక్ జాతీయుడు అలీ తౌకీర్ షేక్, భారతదేశంలోని అతని భాగస్వాముల మధ్య సంబంధాలపై దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పాటు చేసినట్లు హిమంత బిశ్వసర్మ వెల్లడించారు.