Russia: భారత్ ప్రతీష్టాత్మకంగా జీ20 సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది భారత్ జీ20కి అధ్యక్షత వహిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనా- అమెరికాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు భారత్ పేదరిక నిర్మూలన, ఆహార, ఇంధన భద్రత, ఉగ్రవాదంపై పోరుపై చర్చించాలని అనుకుంటోంది. ఇదిలా ఉంటే పాశ్చాత్య దేశాలు మాత్రం రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని సమావేశాల్లో లేవనెత్తాలని చూస్తున్నాయి. ఇటీవల బెంగళూర్ వేదికగా జరిగి జీ20 ఆర్థిక మంత్రుల సమావేశంలో కూడా యుద్ధంపై ఏకాభిప్రాయం కోసం పలుదేశాలు ఒత్తడి తీసుకువచ్చాయి. అయితే రష్యా, చైనాలు ఇందుకు అంగీకరించకపోవడంతో ఏకాభ్రియం కుదరలేదు.
Read Also: Iran: బాలికల పాఠశాలలపై గ్యాస్ దాడులు.. 100 మందికి పైగా ఆస్పత్రికి తరలింపు
ఇదిలా ఉంటే భారత్ జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి అతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఇండియాకు చేరుకున్నారు. ఈ క్రమంలో రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రష్యాపై ప్రతీకారం తీర్చుకునేందుకు జీ20 వేదికను పాశ్చాత్య దేశాలు ఉపయోగించుకోవాలని చూస్తున్నాయని విమర్శించింది. యూఎస్, దాని మిత్రపక్షాల విధ్వంసక విధానాల వల్ల ప్రపంచం ఇప్పటికే విపత్తు అంచున ఉందని, వెస్ట్రన్ దేశాల తీరు సామాజిక-ఆర్థికాభివృద్ధిని వెనక్కి నెట్టిందని, పేదదేశాల కష్టాలను మరింత తీవ్రం చేసిందని ప్రకటనలో పేర్కొంది.
విదేశాంగ మంత్రుల సమావేశం నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మధ్య చర్చలు జరిగే అవకాశం లేదు. గతేడాది ఇండోనేషియా బాలి వేదికగా జరిగిన సమావేశంలో కూడా వీరిద్దరు మాట్లాడుకోలేదు. ఇక చైనీస్ స్పైబెలూన్ ఘటనపై అమెరికా ఆగ్రహంతో ఉంది. దీంతో చైనా మంత్రి క్విన్ గాంగ్ తో కూడా ఆంటోనీ బ్లింకెన్ సమావేశం ఉండకపోవచ్చు. బుధవారం సాయంత్రం నుంచి విదేశాంగ మంత్రుల సమావేశం ప్రారంభం అయింది. మంగళవారం ప్రధాన చర్చలు జరుగనున్నాయి.