Delhi High Court: 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ముందస్తు బెయిల్ మంజూరుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. స్నేహాన్ని అత్యాచారానికి లైసెన్సుగా పరిగణించలేమని, లైంగిక వేధింపులు, నిర్భంధం, శారీరక హింసకు స్నేహాన్ని రక్షణగా ఉపయోగించలేమని పేర్కొంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ నిందితుడికి బెయిల్‌ను నిరాకరించారు.
‘ఇద్దరు స్నేహితులు, అందువల్ల ఏకాభిప్రాయ సంబంధానికి సంబంధించిన కేసు కావచ్చు అనే వాదనల్ని అంగీకరించలేము’’ అని కోర్టు పేర్కొంది. బాలిక, సదరు వ్యక్తి ఇద్దరు స్నేహితులు అయినప్పటికీ, స్నేహం వల్ల బాధితురాలిపై పదే పదే అత్యాచారం చేయడానికి, ఆమెను తన స్నేహితుడి ఇంట్లో బంధించడానికి, ఆమెను కనికరం లేకుండా కొట్టడానికి ఆ వ్యక్తికి లైసెన్సు ఇవ్వదు అని జస్టిస్ శర్మ, బాలిక వైద్య ఆధారాలను సమర్థిస్తూ వ్యాఖ్యానించారు.
Read Also: Smriti Mandhana: ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన స్మృతి మంధాన!
ఈ కేసును పరిశీలిస్తే, నిందితుడు, బాధిత బాలిక ఇరుగు పొరుగు వాళ్లు. బాలికను నిందితుడైన వ్యక్తి తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడని, అక్కడ దాడి చేశాడని, సంఘటన గురించి ఎవరికి చెప్పకుండా బెదిరించాడని బాలిక ఆరోపించింది. అయితే,11 రోజులు ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదైందని, తమ ఇద్దరి సంబంధం ఇద్దరి ఇష్టపూర్వకంగానే ఉందని నిందితుడు వాదించాడు. ఈ వాదనల్ని కోర్టు తోసిపుచ్చింది. బాలిక భయం, గాయాల దృష్ట్యా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సంఘటన వల్ల భయంతో బాలిక ముందుగా తన తల్లిదండ్రులకు వెళ్లడించకుండా ఉందని న్యాయమూర్తి అన్నారు. ఈ కేసులో నిందితుడైన వ్యక్తికి బెయిల్ ఇవ్వడానికి ఎలాంటి కారణాలు లేవని కోర్టు చెబుతూ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
