జమ్ము & కశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్స్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారా, కుల్గాం జిల్లాల్లో ఈ ఎన్‌కౌంటర్స్‌ని నిర్వహించారు. మరణించిన ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్తాన్‌కు చెందినవాడని, లష్కరే తోయిబా సంస్థ కోసం పని చేస్తున్నాడని తెలిసింది. కొంతకాలం క్రితం అరెస్ట్ చేసిన షౌకత్ అహ్మద్ షేక్ అనే ఉగ్రవాది ఇచ్చిన సమాచారం ఆధారంగా.. సైన్యంతో కలిపి పోలీసులు కుప్వారా జిల్లా లోలబ్ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రవాదుల శిబిరాల్ని గుర్తించి, చుట్టుముట్టారు. ఇది గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అందుకు ధీటుగా భద్రతా సిబ్బంది జవాబివ్వడంతో.. ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. వీరిలో ఒకరు పాకిస్తాని ఉగ్రవాది అని ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. సరిగ్గా ఇలాంటి ఎదురుకాల్పులే కుల్గాం జిల్లా దమ్హల్ హంజీపొర ప్రాంతంలోనూ జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. పారిపోయిన ఇతర ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అంతకుముందు బారాముల్లా క్రీరి ప్రాంతంలోని నాజీబాత్ వద్ద ఎన్‌కౌంటర్ నిర్వహించగా.. ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు కార్డర్ సెర్చ్‌ను ప్రారంభించాయి. ఈ సందర్భంగా ఓ పోలీస్ అధికారి కూడా అమరుడయ్యారు. హతమైన ఉగ్రవాదుల్ని జైష్-ఏ-మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా గుర్తించారు. గత నాలుగు నెలలుగా వాళ్లు యాక్టివ్‌గా ఉన్నారని, ఎన్‌కౌంటర్ ప్రదేశం నుంచి పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఉగ్రవాదుల్ని ఏరిపారేయాల్ని కంకణం కట్టుకున్న భద్రతా బలగాలు.. ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.