Jaya Prada: మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదని ‘పరారీ’ ఉన్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ రాంపూర్ ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ప్రకటించింది. ఆమెపై ఉన్న రెండు కేసుల విచారణలో హాజరుకాకపోవడంతో ప్రత్యేక కోర్టు మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో, ఆమె బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యర్థిగా ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఉల్లంఘించినట్లు కేసులు నమోదయ్యాయి.
ఏడు సార్లు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినప్పటికీ జయప్రద కోర్టు ముందు హాజరుకాకపోవడంతో ఆమెపై ఎంపీ ఎమ్మెల్యే కోర్టు కఠిన చర్యలకు ఉపక్రమించింది. న్యాయమూర్తి శోభిత్ బన్సార్.. మార్చి 6న ఆమె కోర్టుకు హాజరు అయ్యేలా డిప్యూటీ ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఎస్పీని ఆదేశించింది. వారెంట్ ఉన్నప్పటికీ, నిందితుడు కోర్టుకు హాజరుకాని పక్షంలో న్యాయస్థానాలు ఈ చట్టపరమైన చర్యలను తీసుకుంటుంది. జయప్రదపై సెక్షన్ 82 CrPC కింద చర్య తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
Read Also: Delhi: జమాతే ఇస్లామీపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన
తెలుగు, హిందీ చిత్రాల ద్వారా జయప్రద అందరికి సుపరిచితం. సినిమా రంగాన్ని వదిలి 1994లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లో అడుగుపెట్టారు. రాజ్యసభ, లోక్‌సభ ఎంపీగా పనిచేశారు. 1996లో ఏపీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఎన్టీఆర్ మరణం తర్వాత ఆమె ములాయం సింగ్ పిలుపు మేరకు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. 2004, 2009లో ఎస్పీ టికెట్ పై రాంపూర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. 2014లో రాష్ట్రీయ లోక్‌దళ్ నుంచి బిజ్నోర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో బీజేపీలో చేరారు.