Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ‘‘అణుశక్తి’’కి సంబంధించి కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ‘‘విక్షిత్ భారత్ అణుశక్తి చాలా ముఖ్యమైందని’’ వ్యాఖ్యానించిన మంత్రి.. భారత్ ఇప్పుడు స్మాల్ రియాక్టర్లను, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అభివృద్ధి చేయడానికి, పరిశోధనలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. దేశ చరిత్రలో మొదటిసారిగా అణు శక్తి రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను అనుమతిస్తూ చారిత్రాత్మక నిర్ణయాన్ని వెల్లడించారు. మొదటిసారిగా అణు కర్మాగారాల ఏర్పాటులో భాగస్వామిగా ఉండటాన్ని ప్రైవేట్ రంగాన్ని అనుమతించారు.
ప్రైవేట్ రంగాన్ని అనుమతించడం ఒక నూతన ప్రారంభమని నీతి ఆయోగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సభ్యుడు వికె సరస్వత్ చెప్పారు. పరమాణు శక్తి తక్కువ కార్బన్ ఉద్గారాలతో, శక్తిని అందిస్తుందని, కాబట్టి ప్రభుత్వం స్మాల్ రియాక్టర్ల అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ నిర్ణయంపై ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పిసిఐఎల్) ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ భువన్ చంద్ర పాఠక్ మాట్లాడుతూ.. అణుశక్తి అభివృద్ధిలో భాగస్వామిగా ఉండటానికి ప్రైవేట్ రంగానికి అనుమతి ఇవ్వడం చాలా స్వాగతించదగిన విషయమని అన్నారు.
Read Also: Yeto Vellipoyindi Manasu : అసలే బిజీ అంటే ‘సమంత- నాని’ల సినిమా కూడా దింపుతున్నారు!
వాతావరణ మార్పు ప్రమాదం ముంచుకొస్తున్న నేపథ్యంలో జీరో కార్బన్ ఉద్గారాలు కలిగి విద్యుత్‌ని అందించే అణుశక్తి అనేది అందరి ముందు ఉన్న ప్రత్యామ్నాయం. ఈ రోజు తన బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘‘భారత్ స్మాల్ రియాక్టర్స్ (BSR), భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (BSMR) రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, న్యూక్లియర్ టెక్నాలజీల రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం మా ప్రభుత్వం ప్రైవేట్ సెక్టార్‌తో భాగస్వామి అవుతుంది.’’ అని ఈ రంగానికి మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన ఆర్ అండ్ డీ నిధులు అందుబాటులో ఉంచబడతాయని చెప్పారు.
భారతీయ అణుశక్తి చట్టం -1962 ప్రకారం.. అణుశక్తి ఉత్పత్తి ప్రైవేట్ రంగాన్ని పాల్గొనడానికి అనుమతించదు. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు ప్రకారం, భారతదేశం ఇప్పటికే 6780 మెగావాట్ల అణుశక్తిని కలిగి ఉంది. ప్రస్తుతం, భారతదేశంలో 22 ఆపరేటింగ్ రియాక్టర్లు ఉన్నాయి, వాటిలో 18 ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు (PHWRs) మరియు నాలుగు లైట్ వాటర్ రియాక్టర్లు (LWRs). బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లు ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, భారత్ కూడా ప్రైవేట్ రంగానికి సహకరించడం ద్వారా మాడ్యులర్ రియాక్టర్లను అభివృద్ధి చేస్తుంది. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అనేది అణు విద్యుత్ ప్లాంట్‌లను తయారు చేయడంలో పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌గా చెప్పవచ్చు. విద్యుత్‌తో పాటు సిమెంట్, ఉక్కు పరిశ్రమల వంటి పెద్ద పరిశ్రమీలకు క్యాప్టివ్ పవర్ యూనిట్‌లుగా పరిష్కారాన్ని అందిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా చిన్న మాడ్యులర్ రియాక్టర్లను అభివృద్ధి చేయడంపై పరిశోధనలు జరుగుతున్నాయి, అయితే రష్యాలో మాత్రమే ఫంక్షనల్ యూనిట్లు ఉన్నాయి.