పండుగల సీజన్ వచ్చేస్తోంది.. ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది.. పనిలో పనిగా అందినంత దండుకునే పనిలో పడిపోయాయి రవాణా సంస్థలు.. రద్దీ పెరిగిందంటే చాలు.. అదనపు వడ్డింపులు తప్పవనే తరహాలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్ రద్దీతో విమాన చార్జీలు అమాంతం పెరిగిపోయాయి.. తమిళనాడులోని చెన్నై నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విమానాల్లో చార్జీలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా చెన్నై నుంచి తూత్తుకుడి, మదురై, తిరుచ్చి వైపుగా వెళ్లే విమాన సర్వీసులపై ఆయా విమాన సంస్థలు రెట్టింపు చార్జీలను వసూలు చేస్తున్నాయి.. గతంలో వెబ్‌సైట్‌ల్లో ఉన్న ధరలతో పోలీస్తే ఇప్పుడు మూడు రెట్లు అధికంగా ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
క్రిస్మస్ కు ప్రయాణికుల రద్దీ పెరగడంతో చెన్నై నుంచి తూత్తుకుడి, మదురై, తిరునవంతపురం, కొచ్చి వైపుగా వెళ్లే విమానాల టికెట్లు ముందుగానే రిజర్వ్ చేసుకున్నారు.. చెన్నై నుంచి తూత్తుకుడికి రోజూ 4 విమానాలు, మదురైకు 6, కొచ్చికి, తిరువనంతపురానికి తలా రెండు విమానాలు నడుస్తున్నాయి.. అయితే, సాధారణ సమయాల్లో చెన్నై నుంచి తూత్తుకుడికి టికెట్ ధర రూ.3,500గా ఉంటే.. ప్రస్తుతం అది రూ.10,500 నుంచి రూ.12 వేలుగా ఉండడం గమనార్హం.. ఇక, చెన్నై నుంచి మదురైకి రూ. 3,500 ఉన్న చార్జీ.. తాజాగా రూ. 9,800కి పెరగగా.. చెన్నై నుంచి తిరువనంతపురానికి రూ. 4 వేలు ఉన్న చార్జీ.. ఇప్పుడు రూ. 9 వేలకు చేరింది.. చెన్నై నుంచి కొచ్చికి రూ. 3,500 నుంచి చార్జీలు రూ. 9,500కి పెంచడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.