Delhi Airport: దేశ రాజధాని ఢిల్లీలో గల ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొదటి ఎలివేటెడ్ ట్యాక్సీవేను ప్రారంభించారు. ఇది దేశంలోనే మొదటి ఎలివేటెడ్ ట్యాక్సీవే కావడం విశేషం. దిల్లీ విమానాశ్రయంలో నిర్మించిన ‘ఎలివేటెడ్ ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవే’లతోపాటు నాలుగో రన్ వేను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం ప్రారంభించారు. వంతెన తరహా టాక్సీవే కలిగి ఉన్న దేశంలోని ఏకైక విమానాశ్రయం ఇదే.
Read also: Dasoju Sravan : రేవంత్ రెడ్డి అనుచరుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి
దేశంలో అతిపెద్దదైన దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా నిర్మించిన ఎలివేటెడ్ ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవే (ECT)లతోపాటు నాలుగో రన్ వేను పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం ప్రారంభించారు. దేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలిపారు. కొత్తగా ఈసీటీ అందుబాటులోకి రావడంతో.. కింది నుంచి రోడ్డు మార్గం.. పైనుంచి వంతెన తరహా టాక్సీవే కలిగి ఉన్న దేశంలోని ఏకైక విమానాశ్రయంగా ఐజీఐఏ అవతరించింది. విమానాశ్రయంలోని టర్మినళ్లు, హ్యాంగర్లను రన్‌వేలతో అనుసంధానించే ప్రత్యేక మార్గాలే ఈ టాక్సీవేలు. ఈసీటీ పొడవు 2.1 కి.మీలు ఉంది. ఇది దిల్లీ విమానాశ్రయంలోని ఉత్తర, దక్షిణ ఎయిర్‌ఫీల్డ్‌లను అనుసంధానిస్తుంది. మూడో రన్‌వే నుంచి టర్మినల్-1కి మధ్య దూరాన్ని ఏడు కిలోమీటర్ల మేర తగ్గిస్తుంది. ఏ-380, బీ-777, బీ-747 సహా వైడ్-బాడీ విమానాలు దీనిపైనుంచి రాకపోకలు సాగించవచ్చు. ఇప్పటికే దిల్లీ ఎయిర్‌పోర్టుకు రోజూ 1500కుపైగా విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మున్ముందు మరింత రద్దీని తట్టుకునేలా.. ప్రయాణికుల సమయం ఆదా చేసేలా సౌకర్యాల కల్పనలో భాగంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నాలుగు రన్‌వేలను కలిగి ఉంటుంది.