ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో ఐపీఎల్ క్రికెటర్ ఇల్లు కూడా ఉండడం గమనార్హం.. వివరాల లోకి వెళ్తే.. సోమవారం మధ్యాహ్నం దాదాపు 12 గంటల 30 నిమిషాల సమయంలో ముంబై లోని వెస్ట్ కాందివాలి లోని మహావీర్ నగర్ లోని పవన్ ధామ్ వీణా సంతూర్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. కాగా ఈ ఘటనలో ఓ మహిళతో పాటుగా 8 సంవత్సరాల చిన్నారి మృతి చెందగా.. మరో 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే గాయపడిన 5 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ప్రమాదం జరిగిన భవనంలో నాలుగో అంతస్థులో ఐపీఎల్ క్రికెటర్ పాల్ చంద్రశేఖర్ వాల్తాటి ఇల్లు కూడా ఉంది.
Read also:Bishan Singh Bedi: టీమిండియా మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ కన్నుమూత
మృతి చెందిన ఇద్దరు చంద్రశేఖర్ ఇంటికి వచ్చిన అతిధులని.. వారు అమెరికా నుండి వచ్చారని స్థానికులు తెలిపారు. కాగా భవనంలో రేగిన మంటలను 8 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయంతో అదుపు చేస్తున్నట్లు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే భవనం మొదటి, రెండవ అంతస్తుల్లో మంటలు మరింత తీవ్రంగా ఉన్నాయి. మొదటి అంతస్తు నుంచి ఇంటి బయట వరకు మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రెండు అంతస్తుల్లో ప్రజల్లో గందరగోళం నెలకొంది. మంటల తాకిడికి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.