Fish bite: చేప కాటు ఏకంగా ఓ వ్యక్తి చేయినే లేకుండా చేసింది. కేరళలోని కన్నూర్ జిల్లాలో 38 ఏళ్ల రైతు చేపకాటుకు గురైన తర్వాత ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకింది. చేప కాటుకు గురైన చేయిని మణికట్టు వరకు తొలగించాల్సి వచ్చింది. తలస్సేరిలోని మడపీడిక నివాసి అయిన రజీష్, ఫిబ్రవరి ప్రారంభంలో ఒక గుంటను శుభ్రం చేస్తున్నప్పుడు, స్థానికంగా కడు అని పిలిచే చేప కరిచినట్లు చెప్పాడు.
అయితే, మొదట్లో గాయం చిన్నదిగా కనిపించిందని, ఆ తర్వాత కొద్ది రోజులకే తీవ్రమైన పరిస్థితికి దారి తీసినట్లు చెప్పారు. కొడియేరి ప్రాథమిక ఆస్పత్రికి వైద్య సాయం కోసం వెళ్లినప్పుడు ఆయనకు టెటనస్ ఇంజెక్షన్ ఇచ్చారు. గాయం తీవ్రం కావడంతో అతడిని మహేలోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు. ఆ తర్వాత మెరుగైన వైద్య కోసం కోజికోడ్ తీసుకెళ్లారు.
Read Also: Aamir Khan: ఆమిర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ “మహాభారత్”.. పనులు షురూ!
అక్కడ అతడికి ‘‘గ్యాస్ గాంగ్రీన్’’ లేదా క్లోస్టిడియల్ మయోనెక్రోసిస్ ఉన్నట్లు నిర్ధారించారు. ఇది కణాజాలాన్ని నాశనం చేసి, దానిలో గ్యాస్‌ని ఉత్పత్తి చేసే తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ అప్పటికే అరచేయి వరకు వ్యాపించింది. ఆ తర్వాత మెదడు దెబ్బతినే అవకాశం ఉండటంతో, ఇన్ఫెక్షన్ సోకిన భాగాన్ని తీసేశారు. ఫలితంగా రజీష్ తన చేయిని కోల్పోవాల్సి వచ్చింది.
బురద నీటిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య అధికారులు సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లోనే గ్యాస్ గ్యాంగ్రీన్‌కి కారణమయ్యే బ్యాక్టీరియా నివసిస్తుందని వెల్లడించారు. కలుషిత వాతావరణంలో ఏదైనా గాయాలు తగిలితే వెంటనే వైద్య సాయాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.