Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన ఎంపీ సంజయ్ సింగ్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా ఈ రోజు ఆయనకు కోర్టు అక్టోబర్ 10 వరకు 5 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో అంతకుముందు ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌తో పాటు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరు జైలులో ఉన్నారు. బుధవారం రోజు ఎంపీ సంజయ్ సింగ్ ఇంటిలో 10 గంటల పాటు ఈడీ విచారించిన తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసింది.
చావడానికైనా సిద్ధంగా ఉన్నాను కానీ భయపడను.. ప్రధాని నరేంద్రమోడీ, అదానీ అవినీతి గురించి నిరంతరం మాట్లాడుతాను, అదానీ అవినీతి గురించి ఇప్పటి వరకు ఈడీకి చాలా ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదని అరెస్ట్ తర్వాత విడుదల చేసిన వీడియోలో సంజయ్ సింగ్ ఆరోపించారు. ఆప్ పార్టీని దెబ్బతీయడానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీలతో దాడులు చేయిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష ఇండియా కూటమిని చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారని విమర్శిస్తున్నాయి.
Read Also: India-Canada: “అంతర్గత విషయాల్లో జోక్యం”.. కెనడా దౌత్యవేత్తల తగ్గింపుపై భారత్..
ఇదిలా ఉంటే సంజయ్ సింగ్ అరెస్టుపై ఢిల్లీ సీఎం ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ తీరును దుయ్యబట్టారు. ఢిల్లీ లిక్కర్ కేసు తప్పుడు కేసని, దర్యాప్తులో ఏం బయటపడలేదని, దర్యాప్తు సంస్థలు టైమ్ వేస్ట్ చేస్తున్నాయని, ప్రజలపై తప్పుడు కేసులు పెట్టడం వల్ల దేశం అభివృద్ధి చెందదని ఆయన అన్నారు. అంతకుముందు మనీష్ సిసోడియా బెయిల్ విచారణలో సుప్రీంకోర్టు,ఈడీని ఆధారాలపై ప్రశ్నించడాన్ని ఆయన ప్రస్తావించారు.
ఈ రోజు మనీష్ సిసోడియా బెయిల్‌పై విచారించిన సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థలకు కీలక ప్రశ్నలు సంధించింది. మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా..? అని ప్రశ్నించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కొందరు వ్యక్తులకు లబ్ధి చేకూరే విధంగా ఈ మధ్యం విధానాన్ని రూపొందించారని సీబీఐ ఆరోపించింది. ఇందుకు కొన్ని వాట్సాప్ మెసేజులను సాక్ష్యంగా సీబీఐ సమర్పించింది. అయితే ఈ మెసేజుల ఆమోదయోగ్యతను సుప్రీం ప్రశ్నించింది. ఈ కేసులో లంచాలపై విజయ్ నాయర్, మనీష్ సిసోడియా మాట్లాడుకోవడం చూశారా..? అప్రూవర్ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఎలా సాక్ష్యంగా పరిగణించగలమని కోర్టు వ్యాఖ్యానించింది.