Fake Toll Plaza: నేరాల తీరు మారుతోంది. గతంలో ఇంటికి కన్నాలు వేసే పద్ధతిలో నేరాలు జరగడం లేదు. ఇప్పుడంతా సైబర్ దాడులు, టెక్నాలజీ ఆధారిత మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇదిలా ఉంటే గుజరాత్‌లో జరిగిన ఓ నేరం గురించి తెలిస్తే, మోసగాళ్లు ఎంతగా తెలివిగా ప్లాన్ చేశారో తెలుస్తోంది. ఏకంగా ఓ హైవే ప్రత్యామ్నాయంగా రోడ్డు నిర్మించి నకిలీ టోల్‌ప్లాజాను ఏర్పాటు చేసుకుని దర్జాగా ఏడాదిన్నర పాటు దోపిడీ చేశారు. ఏకంగా ప్రభుత్వాన్ని మోసం చేయడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటన గుజరాత్ లోని బమన్ బోర్-కచ్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. అయితే జాతీయరహదారిని బైపాస్ చేసే రోడ్డుపై ఓ ప్రైవేట్ ల్యాండ్‌లో టోల్ ప్లాజా ఏర్పాటు చేసి, హైవేపై వసూలు చేస్తున్న టోల్‌లో సగం డబ్బులు వసూలు చేస్తున్నారు. మోర్బీ జిల్లాలో ఈ బైపాస్ రోడ్డును నిర్మించి, ఏకంగా ఏడాదిన్నర పాటు టోల్ వసూలు చేసి కోట్ల రూపాయలను కోల్లగొట్టారు.
READ ALSO: IT Raids: కాంగ్రెస్ ఎంపీపై ఐటీ దాడులు.. ఏకంగా రూ.100 కోట్ల నగదు స్వాధీనం..
వివరాల్లోకి వెళితే మోర్బీ -కచ్ జిల్లాలను కలిపే 8ఏ నేషనల్ హైవేపై వాఘసియా టోల్ ప్లాజా ఉంది. అయితే ఈ టోల్ ప్లాజాకు తగలకుండా.. ఓ బైపాస్ రోడ్డు ఉండేది. టోల్ ఛార్జీలు తగలకుండా వాహనదారులు ఈ రోడ్డును వినియోగించే వారు. అయితే దీన్ని గమనించిన కొందరు కేటుగాళ్లు నిరుపయోగంగా ఉన్న ఓ సిరామిక్ కంపెనీని అద్దుకు తీసుకుని దానికి ఇరువైపులా హైవే వరకు బైపాస్ రోడ్డు నిర్మించి ఫ్యాక్టరీలోనే టోల్ ప్లాజా ఏర్పాటు చేశారు. అయితే హైవేతో పోలిస్తే.. నకిలీ టోల్ ప్లాజాలో తక్కువ డబ్బులు వసూలు చేస్తుండటంతో దీనిపై వాహనదారులు కూడా ఫిర్యాదు చేయలేదు.
ఇటీవల ఈ వ్యవహారంపై స్థానిక మీడియాలో వార్తలు రావడంతో ఈ నకిలీ వ్యవహారం గుట్టురట్టైంది. ఈ మోసంలో ఏకంగా రూ.75 కోట్లు వసూలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో వైట్ హౌస్ సిరామిక్ కంపెనీ యజమాని అమర్షి పటేల్, వనరాజ్ సింగ్ ఝాలా, హర్విజయ్ సింగ్ ఝాలా, ధర్మేంద్ర సింగ్ ఝాలా, యువరాజ్ సింగ్ ఝాలా మరియు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న మోర్బి జిల్లా కలెక్టర్ జీటీ పాండ్యా తెలిపారు.