RSS: బీజేపీ, తన మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కలిసి పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే దానికి హర్యానా గెలుపే నిదర్శనం. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయలేదని, ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఒకానొక దశలో హర్యానాలో బీజేపీ ఘోరంగా ఓడిపోతుందనే ఊహాగానాల నుంచి భారీ గెలుపు దిశగా పయణించింది. వరసగా రెండు సార్లు అధికారంలో ఉన్న బీజేపీ, తాజాగా జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించింది.
సరిగ్గా ఎన్నికలకు కొన్ని నెలల ముందు సీఎంగా ఉన్న మనోహర్ లాల్ కట్టర్ గురించి ఆర్ఎస్ఎస్ ఆగస్టులో అంతర్గత సర్వే చేసింది. ఖట్టర్‌పై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, నాయకత్వం, వ్యూహాలు మార్చాటని పిలుపునిచ్చింది. ఇదే సమయంలో నయాబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిగా చేసింది. గ్రామీణ ఓటర్లలో విశ్వాసాన్ని పెంపొందించడానికి, అట్టడుగు స్థాయిలో పనిచేయడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ సాయాన్ని కోరింది. జూలై 29న న్యూఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ జాయింట్ జనరల్ సెక్రటరీ అరుణ్ కుమార్, హర్యానా బీజేపీ చీఫ్ మోహన్‌లాల్ బర్దోలీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో సహా కీలక వ్యక్తులు సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో బీజేపీని తీసుకెళ్లడానికి చర్చించారు. అభ్యర్థుల ఎంపిక, గ్రామీణ ఓటర్లతో సంబంధాలు, పథకాలను ప్రోత్సహించడం, అభ్యర్థులు-కార్యకర్తల మధ్య సమన్వయం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.
Read Also: Delhi: న్యూట్రిషన్ సెక్యూరిటీపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
సెప్టెంబర్ ప్రారంభంలో ఆర్ఎస్ఎస్ ప్రతీ జిల్లాలోకు కనీసం 150 మంది వాలంటీర్లను మోహరించింది. గ్రామీణ ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా కార్యక్రమాలు ప్రారంభించింది. బీజేపీపై వ్యతిరేకతను పరిష్కరించేందుకు మిషన్ ప్రారంభించింది. ఏకంగా హర్యానాలో ఆర్ఎస్ఎస్ 16 వేలకు పైగా సమావేశాలు నిర్వహించింది. దీంతోనే బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ కార్యకర్తలకు బదులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రచారం చేశారు. ప్రతీ ఇంటికి వెళ్లీ ప్రతీ ఓటర్‌ని కలుసుకున్నారు.
సెప్టెంబర్ 1-9 మధ్య పార్టీ ఐక్యత, వ్యూహాన్ని పటిష్టం చేయడానికి ఆర్ఎస్ఎస్ ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపుగా 90 సమావేశాలు నిర్వహించింది. పార్టీ కార్యకర్తలు, గ్రామీణ ఓటర్లతో దాదాపుగా 200 సమావేశాలు నిర్వహించింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ఎస్ పెద్దగా పాల్గొనలేదు, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ గెలుపుకోసం కష్టపడింది. ఒకవేళ ఆర్ఎస్ఎస్ పనిచేయకుంటే మాత్రం హర్యానాలో బీజేపీ ఓడిపోయేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హర్యానా విజయం బీజేపీ-ఆర్ఎస్ఎస్ కలిసి పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిని నిరూపించాయి.