Sanjay Nirupam: పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడని ఇటీవల కాంగ్రెస్ తన పార్టీకి చెందిన కీలక నేత సంజయ్ నిరుపమ్ని బహిష్కరించింది. శుక్రవారం ఆయన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు. 19 ఏళ్ల క్రితం బాల్ థాకరే నేతృత్వంలోని శివసేను వదిలిపెట్టి కాంగ్రెస్లో చేరిన ఆయన సొంతగూటికి తిరిగి వచ్చారు. గత నెలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని చెబుతూ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. శివసేనలో చేరిన సంజయ్ నిరుపమ్కి శివసేన డిప్యూటీ లీడర్, అధికార ప్రతినిధి బాధ్యతల్ని సీఎం ఏక్నాథ్ షిండే అప్పగించారు.
Read Also: Imran Khan: పాకిస్తాన్ ఆర్మీ నన్ను చంపడమే మిగిలింది.. మాజీ ప్రధాని సంచలనం..
సంజయ్ నిరుపమ్ తన భార్య, కూతురితో కలిసి శివసేనలో చేరారు. శివసేనలో చేరడం సొంతింటికి తిరిగి రావడం లాంటిదని అన్నారు. నేను కాంగ్రెస్ పరిస్థితి ఏంటో మీకందరికి తెలుసని మీడియాతో అన్నారు. 1996లో బాల్ థాకరే నిరుపమ్ని రాజ్యసభకు పంపారు. అయితే, 2005లో రాజ్యసభకు పదవీ విరమణ చేయడంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి మారారు. 2005లో కాంగ్రెస్లో చేరిన ఆయన మహారాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2009లో లోక్సభ ఎన్నికల్లో ముంబై నార్త్ సీటులో విజయం సాధించారు. బీజేపీ నేత రామ్ నాయక్ని ఓడించారు.
ఇటీవల ముంబై నార్త్-వెస్ట్ సీటు కోసం నిరుపమ్ పార్టీకి అల్టిమేటం జారీ చేయడంతో అతడిని కాంగ్రెస్ బహిష్కరించింది. ఈ సీటు నుంచి పోటీ చేయాలని నిరుపమ్ భావించినప్పటికీ పొత్తులో భాగంగా కాంగ్రెస్ దీనిని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే)కి కేటాయింది. 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్-ఎన్సీపీతో పొత్తును కూడా ఆయన వ్యతిరేకించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-శివసేన(షిండే)-ఎన్సీపీ(అజిత్ పవార్) కూటమి గెలుపు కోసం నిరుపమ్ పనిచేస్తారని సీఎం ఏక్నాథ్ షిండే చేరిక సమయంలో అన్నారు.