Amit Shah: కర్ణాటక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. బీజేపీ తరుపున శుక్రవారం పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రి అమిత్ షా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వేసే ప్రతీ ఓటు నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) నుంచి కర్ణాటకను కాపాడుతుందని ఆయన అన్నారు. శిరహట్టిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఓటు సరైన నాయకత్వానికి వెళ్లేలా చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
కమలానికి ఓటేసే సమయంలో కేవలం ఎమ్మెల్యే, మంత్రిని ఎన్నుకోవడానికి ఓటేయడం లేదని, మహాన్ కర్ణాటకను రూపొందించడానికి, ప్రధాని మోడీతో నాయకత్వాన్ని మరింత బలపరిచేందుకు ఓటేస్తున్నామని గుర్తుంచుకోండని అన్నారు. కర్ణాటకకు రక్షణ, శ్రేయస్సును కేవలం బీజేపీ మాత్రమే ఇవ్వగలదని, శాంతియుత, సురక్షిత వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు పీఎఫ్ఐని నిషేధించామని ఆయన అన్నారు. టీ అమ్ముకునే స్థాయి నుంచి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ అని అమిత్ షా అన్నారు.
Read Also: LSG vs PBKS: విధ్వంసం సృష్టించిన లక్నో జట్టు.. పంజాబ్ ముందు అతి భారీ లక్ష్యం
కాంగ్రెస్ మతప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించిందని అన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, కాంగ్రెస్ చేసిన తప్పును బీజేపీ సరిదిద్దింది అని, ఆ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, వొక్కలిగ, లింగాయత్ లకు కేటాయించామని అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్ కోటాను తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ కోరుకుంటోందని, ఇదే జరిగితే మళ్లీ లింగాయత్, వొక్కలిగ వర్గాలు రిజర్వేషన్లు కోల్పోతారని అన్నారు.
ప్రపంచం అంతా ప్రధాని మోడీని మెచ్చుకుంటుంటే కాంగ్రెస్ మాత్రం ‘విషసర్పం’ అంటూ విమర్శిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ కు భిన్నంగా రైతుల సంక్షేమం కోసం బీజేపీ నిలబడుతోందని తెలిపారు. గతంలో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా మహదాయి నదీ జలాల వివాదాన్ని పరిష్కరించలేదని, మోడీ రైతుల జీవితాల్లో ఆనందాన్ని నింపేందుకు ఈ సమస్యను పరిష్కరించి ఉత్తర కర్ణాటక రైతులకు మేలు చేశారని అన్నారు. మే 10న కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు ఉండనుంది.