Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో వరసగా ఉగ్రదాడులు, ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా బుధవారం సాయంత్రం దోడా జిల్లాలో మరో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. మూడు రోజుల వ్యవధిలో ఇది నాలుగోది కాగా, దోడా జిల్లాలో ఇది రెండో ఎన్‌కౌంటర్. జూన్ 9న రియాసీలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపడంతో బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. దీని తర్వాత మంగళవారం కథువా జిల్లాలోని ఓ గ్రామంలో ఎన్‌కౌంటర్ జరిగింది. దీంట్లో ఓ జవాన్ అమరుడవ్వగా, ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. ఇదే రోజు దోడా జిల్లాలో చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.
Read Also: Mars: అంగారకుడిపై బిలాలకు యూపీ, బీహార్ పట్టణాల పేర్లు..
మంగళవారం అర్థరాత్రి భదర్వా-పఠాన్‌కోట్ రహదారిలోని చటర్‌గల్లా ఎగువ ప్రాంతంలోని జాయింట్ చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడి చేయడంతో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఐదుగురు సైనికులు మరియు ఒక ప్రత్యేక పోలీసు అధికారి (SPO) గాయపడ్డారు. ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులతో కూడిన బృందం దోడాలోని ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నట్లు ఈ ఉదయం సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. దీంతో వారిని మట్టుపెట్టేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలోనే ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య బుధవారం సాయంత్రం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.
దోడా ప్రాంతలోని చటర్‌గల్లా, గుల్దండి, సర్థాల్, శంఖ్ పాడేర్ మరియు కైలాష్ పర్వత శ్రేణులలో ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ ప్రారంభమైంది. దీంతో భదర్వా-పఠాన్‌కోట్ అంతర్రాష్ట్ర రహదారిపై ట్రాఫిక్ కదలికల్ని పూర్తిగా నిలిపేశారు. ఇదిలా ఉంటే రాజౌరీ జిల్లాలోని నౌషేరా సెక్టార్‌లో కలాల్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద కదలికల నేపథ్యంలో అధికారులు కార్డన్ ఆపరేషన్ ప్రారంభించారు. మరోవైపు పూంచ్, రాజౌరి జిల్లాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘావర్గాల సమాచారం మేరకు భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.