Eknath Shinde: తనను వ్యతిరేకించేవాళ్లకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సవాల్ విసిరారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తన 50 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరు ఓడినా రాజకీయాల నుంచి శాశ్వతంగా సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు. ఉద్ధవ్ ఠాక్రేని వ్యతిరేకించి ఏక్‌నాథ్ షిండేకి మద్దతు తెలిపిన శాసన సభ్యులు ఆయన్ని ఈ రోజు ముంబైలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ ఈ 50 మంది ఎమ్మెల్యేలు తనకు సపోర్ట్ చేయటం ద్వారా చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారని అభిప్రాయపడ్డారు.
‘నా వర్గం శాసనసభ్యుల రాజకీయ భవిష్యత్తుకు నాదే బాధ్యత. అందుకే వాళ్లకు అన్నీ సమకూర్చుతా. నియోజకవర్గాల సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తా. శివసేన గత చరిత్ర చూస్తే ఉద్ధవ్ ఠాక్రేని కాదని నా వైపు వచ్చిన ఎమ్మెల్యేలందరూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల్లో ఓడిపోవటం ఖాయమని కొందరు అంటున్నారు. వాళ్లు మొన్నటిదాకా మాతోపాటే సూరత్, గువాహటిల్లో ఉన్నోళ్లే. వాళ్లందరికీ నేనొక్కటే చెప్పదలచుకున్నా. నా ఎమ్మెల్యే ఒక్కరు ఓడినా నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా’ అని తేల్చిచెప్పారు.
మొదట్లో తమకు తక్కువ మందే మద్దతిచ్చారని, తర్వాత ఆ సంఖ్య 50కి పెరిగిందని ఏక్‌నాథ్‌షిండే గుర్తుచేశారు. తమను వ్యతిరేకించేవాళ్లే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, చివరికి తన ఇంటి మీద రాళ్లు వేయాలని కూడా పిలుపునిస్తున్నారని అన్నారు. అయితే వాళ్లకు స్పందన, మద్దతు కరువైందని, ఈ డర్టీ గేమ్‌లో పాలుపంచుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనే నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారని, వాళ్లు తమతోనే ఉన్నారని ఏక్‌నాథ్ షిండే చెప్పారు.
‘సూరత్, గువాహటిలో ఉన్నప్పుడు నేను చాలా భయపడేవాడిని. నిద్ర కూడా పట్టేది కాదు. రాత్రి ఒంటి గంట వరకు మెలకువతో ఉండేవాణ్ని. ఒంటి గంటకు పడుకున్నా మూడింటికే లేచేవాణ్ని. నా జీవితంలో ఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు. నా భవిష్యత్తు గురించి నాకు ఆందోళన లేదు. నా వర్గం శాసన సభ్యుల భవిష్యత్ కోసమే నా తాపత్రయమంతా. ఎందుకంటే వాళ్లు నా నాయకత్వాన్ని బలపరిచారు. దీంతో నేను ముఖ్యమంత్రినయ్యా. నేను సీఎంని అయ్యానంటే నా వర్గం ఎమ్మెల్యేలు అందరూ సీఎంలు అయినట్లు సంతోష పడుతున్నారు’ అని ఏక్‌నాథ్ షిండే పేర్కొన్నారు.
మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు శివసేన ఎమ్మెల్యేలను చాలా ఘోరంగా చూసేవారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులన్నీ కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలకే ఇచ్చేవారని, తాను ముఖ్యమంత్రినయ్యాను కాబట్టి ఇక ఏ శాసనసభ్యుడికీ అలాంటి కష్టం రాబోందని, ఆ నియోజకవర్గాల ప్రజలకు ఇబ్బందులు ఉండబోవని భరోసా ఇచ్చారు. నిధులు మంజూరు చేయాలంటూ తాను ఒక్కసారి కాదు ఐదు సార్లు నాయకత్వాన్ని వేడుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజల ప్రయోజనాల కోణంలో బాలా సాహెబ్ ఠాక్రే అమలుచేసిన హిందుత్వ అజెండాను ముందుకు తీసుకెళ్లటం కోసం ఉద్ధవ్ ఠాక్రేని పక్కన పెట్టాలనే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఏక్‌నాథ్ షిండే వివరించారు.
‘ప్రధాని నరేంద్ర మోడీ కూడా మా నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. నేను ముఖ్యమంత్రిని అయ్యాక అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని విన్నానని, ఎంతో బాగా నచ్చిందని ప్రధాని మోడీ నాతో చెప్పారు. నేను ఆ మాటలను నా గుండె లోతుల్లో నుంచి మాట్లాడాను’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు.