Shiv Sena MP: శివసేన ఎంపీ మానే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన పార్టీ అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేని పొగుడుతూ ఆయన ‘‘ప్రజల సీఎం’’ అని అన్నారు. ఏక్ నాథ్ షిండే రికార్డుల్లో ఉపముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఆయన ప్రజల ముఖ్యమంత్రి అని శివసేన ఎంపీ ధైర్యశీల్ మానే శనివారం అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత, సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పదవీ చేపట్టిని కొన్ని నెలల తర్వాత ఎంపీ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
హట్కనంగలే లోక్‌సభ నియోజకవర్గానికి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన మానే, ఏక్‌నాథ్ షిండే హాజరైన సమావేశంలో ఈ వ్యాఖ్య చేశారు. ‘‘ఏక్‌నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి అని ప్రభుత్వ రికార్డులో ఉంది, కానీ సామాన్య ప్రజల భావోద్వేగాలను చూస్తే, వారికి ఏక్‌నాథ్ షిండే మాత్రమే ముఖ్యమంత్రి అని స్పష్టంగా తెలుస్తుంది’’ అని అన్నారు. షిండే ప్రజల మనస్సులో ఉన్నారని అన్నారు. పాఠశాలకు వెళ్లే పిల్లలు కూడా ఆయనను చూసి ‘‘షిండే సాహెబ్ వచ్చాడు’’ అని అంటారు. 2.5 ఏళ్లు షిండే సామాన్య ప్రజల మనస్సులను పాలించారని, ఆయన వారి కోసం ఎంతో కష్టపడ్డారని మానే అన్నారు.
Read Also: MI vs RCB: రజత్ పాటిదార్, విరాట్ మెరుపులు.. ముంబై లక్ష్యం ఎంతంటే?
మహాయుతిలో మరోసారి వివాదం:
మానే వ్యాఖ్యలు మరోసారి మహాయుతిలో లుకలుకలు బయటపడ్డాయి. షిండేని ఏకంగా ప్రజల సీఎం అని చెప్పడం వీటికి బలం చేకూర్చిందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో నన్ను తేలికగా తీసుకోకండి అంటూ షిండే హెచ్చరించారు. గతేడాది చివర్లో జరిగి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ+శివసేన (షిండే)+ఎన్సీపీ(అజిత్ పవార్)ల ‘‘మహాయుతి కూటమి’’ సంచలన విజయం సాధించింది. మొత్తం 288 స్థానాలకు గానూ 233 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ 132 సీట్లను, శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
అయితే, ఏక్‌నాథ్ షిండే సీఎం పోస్టు కోసం చాలా ప్రయత్నించారు. అయితే, బీజేపీ బలం ఎక్కువగా ఉండటంతో ఫడ్నవీస్ సీఎంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఏక్‌నాథ్ షిండే అసంతృప్తితో ఉన్నారు. పలు సందర్భాల్లో ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీఎం ఫడ్నవీస్ ఆధ్వర్యంలో సమావేశాలకు గైర్హాజరు అయ్యారు. దీనిని బట్టి మహాయుతిలో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.