Earthquake in Gadchiroli district: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. తెలంగాణలో సరిహద్దులను ఆనుకుని ఉన్న గడ్చిరోలి జిల్లాలో ఈ భూకంపం సంభవించింది. గడ్చిరోలి జిల్లా దక్షిణ ప్రాంతం సిరోంచా తాలుకాలోని ఉమనూర్-జింగనూర్ ప్రాంతంలో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయింది. రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల సమీప ప్రాంతాల్లో ప్రకంపనలు ఏర్పడ్డాయి. గడ్చిరోలి జిల్లాను ఆనుకుని తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలు ఉన్నాయి. భూకంప కేంద్రానికి సమీపంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని సరస్వతి, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలు ఉన్నాయి. గోదావరి, ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో తరుచుగా గడ్చిరోలి జిల్లాలో భూకంపాలు వస్తున్నాయి.
Read Also: Kantara: కాంతారకు పెద్ద షాకిచ్చిన కోర్టు.. అది తొలగించాల్సిందే!
శుక్రవారం అర్థరాత్రి 12.45 గంటలకు సిరోంచా ప్రాంతంలో స్వల్ప భూప్రకంపలను చోటు చేసుకున్నాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉమనూర్, జింగనూర్ మధ్య కొండ ప్రాంతాల్లో భూకంప కేంద్ర ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గత కొన్నేళ్లుగా గడ్చిరోలి కేంద్రంగా భూకంపాలు వస్తున్నాయి. గతేడాది అక్టోబర్ 31న గడ్చిరోలి జిల్లాలో 4.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పుడు కూడా భూకంప కేంద్ర మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దుల్లోనే ఉంది. దీని కారణంగా మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల్లో ప్రకంపనలు ఏర్పడ్దాయి. జనాలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.