దుబాయ్ వెళ్లేందుకు ఢిల్లీ నుంచి బయల్దేరిన స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పాకిస్థాన్‌లోని కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ విమానంలోని అందరు ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. స్పైస్‌జెట్‌కు చెందిన ఎస్జీ-11 విమానం మంగళవారం దిల్లీ నుంచి దుబాయికి బయలుదేరింది. అయితే ఫ్యూయల్ ఇండికేటర్ లైట్ సక్రమంగా పని చేయకపోవడంతో కరాచీకి దారి మళ్లించినట్లు తెలుస్తోంది. ఫ్యూయల్ ఇండికేటర్ పనిచేయడం లేదని గుర్తించిన పైలట్లు.. ముందు జాగ్రత్తగా విమానాన్ని ల్యాండ్ చేయాలని భావించారు. సమీపంలో గల కరాచీ ఎయిర్‌పోర్టు ఏటీసీని సంప్రదించగా… వారి సూచనల మేరకు విమానాన్ని ల్యాండ్ చేశారు. ఈ విమానం కరాచీలో సురక్షితంగా దిగింది. దీనిలోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
విమానం గాలిలో ప్రయాణించిన 53 నిమిషాల తర్వాత కరాచీలో ఉదయం 08.03 గంటల(స్థానిక కాలమానం)కు ల్యాండ్ అయింది. సురక్షితంగా ల్యాండ్ అయినట్లు పాకిస్తాన్ పౌర విమానయాన అథారిటీ అధికారి తెలిపారు. ఎటువంటి అత్యవసర పరిస్థితిని ప్రకటించలేదని.. కరాచీ విమానాశ్రయంలో విమానం సాధారణ ల్యాండింగ్ చేయబడిందని స్పైస్ జెట్ సంస్థ వెల్లడించింది. విమానంలోని ప్రయాణికులు కరాచీ నుంచి దుబాయి వెళ్లేందుకు వీలుగా మరో విమానాన్ని భారత్ నుంచి పంపినట్లు స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అప్పటివరకు ప్రయాణికులు ఎవరూ ఇబ్బంది పడకుండా వారికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని, అందుకే కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే.. అలాంటిదేమీ లేదని అధికారులు స్పష్టం చేశారు.
Rains: ముంబయిని వణికిస్తున్న వరుణుడు.. మరోసారి భారీ వర్షసూచన
ఇదిలావుండగా, జూలై 2న కూడా స్పైస్‌జెట్ విమానం ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. 5000 అడుగుల ఎత్తులో ఎగురుతుండగా విమానం కేబిన్‌లో పొగ రావడంతో ఈ విమానాశ్రయంలో దించారు. ఈ విమానం ఢిల్లీ నుంచి జబల్‌పూర్ వెళ్లేందుకు బయల్దేరింది.