Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన కొత్త మూవీ లియోపై తమిళనాడులో పొలిటికల్ వివాదం రాజుకుంది. దీనిపై అధికార డీఎంకేపై ఏఐడీఎంకే పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. గతంలో ఏఐడీఎంకే ప్రభుత్వంలో సమాచార, ప్రచార మంత్రిగా పనిచేసిన కదంబూర్ రాజు డీఎంకేని విమర్శించారు. లియో షో టైమింగ్స్ పై ఆంక్షలు విధించినందుకు డీఎంకే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. లియో మూవీ ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమాకు 5 షోలకు మాత్రమే అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఉదయం 9 గంటల నుంచి అర్థరాత్రి 1.30 గంటలకు మాత్రమే షోలకు అనుమతి ఇచ్చింది.
Read Also: Nikki Haley: గాజా పౌరులను ఎందుకు మీ దేశాల్లోకి అనుమతించడం లేదు.. ఇస్లామిక్ దేశాలపై మండిపాటు..
ఈ నేపథ్యంలో ఇది పొలిటికల్ వివాదానికి దారి తీసింది. దళపతి విజయ్‌ని చూసి డీఎంకే భయపడుతోందని, అందుకనే లియో మూవీపై ఆంక్షలు విధిస్తోందని కదంబూర్ రాజు విమర్శించారు. విజయ్, అజిత్ వంటి టాప్ స్టార్లకు స్పెషల్ షోలు వేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, దీపావళి, పొంగల్ సమయంలో అగ్రతారల కోసం ప్రత్యేక షోలకు అనుమతించాలని, మా పాలనలో ఇలాంటి ఆంక్షలు ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు.
2006-2011 మధ్య కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇలాగే జరిగిందని రాజు గుర్తు చేశారు. తమిళ సినిమాల విడుదలపై ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలోని రెడ్ జెయింట్ మూవీస్ గుత్తాధిపత్యాన్ని అనుభవిస్తోందని కూడా కదంబూర్ రాజు ఆరోపించారు. అన్నాడీఎంకే అధినేత ‘లియో’ ఆడియో లాంచ్ రద్దు చేయడంలో కూడా డీఎంకే పాత్ర ఉందన్నారు. అయితే చెన్నైలో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఈవెంట్ కి జరిగిన విధంగా సమస్యలు తలెత్తుతాయనే కారణంగానే లియో ఆడియో లాంచ్ ను రద్దు చేయాల్సి వచ్చిందని డీఎంకే వర్గాలు తెలిపాయి. సామర్థ్యానికి మించి జనాలు హాజరైతే సమస్యలు వచ్చే ప్రమాదం ఉండటంతోనే ఇలా చేశామని డీఎంకే తెలుపుతోంది.