రైలు ప్రయాణం మధుర జ్ఞాపకం అంటూ ఎన్నో సినిమాల్లో సన్నివేశాలు చిత్రికరించారు. అయితే.. సీటు దొరికి ప్రయాణం హాయిగా సాగిపోతే అంతా మామూలే.. కానీ.. బెర్త్ రిజర్వేషన్ లేకపోతేనే కష్టం. అయితే.. ఏదేమైనా రైలు ప్రయాణంలో కొంత టెన్షన్ తప్పదు.. తాము దిగే స్టేషన్ వచ్చేసిందా.. ఇంకా ఎంతసేపట్లో దిగాల్సిన స్టేషన్ రాబోతోందో తెలియని కొన్ని సార్లు తికమక పడుతుంటారు. అయితే.. ఈ నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. ‘డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం’ పేరిట కొత్త సేవలను ఇండియన్ రైల్వే అందుబాటులోకి తెచ్చింది.
దీంట్లో భాగంగా దిగాల్సిన స్టేషన్ రావడానికి 20 నిమిషాల ముందు మీ ఫోన్‌కు అలర్ట్ వస్తుంది. ఈ సేవల కోసం 139 నంబర్‌కు కాల్ లేదా మెసేజ్ ద్వారా మీ పీఎన్‌ఆర్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత గమ్యస్థానానికి 20 నిమిషాల ముందు మీకు ఐఆర్‌సీటీసీ నుంచి ఫోన్ వస్తుంది. ఈ సేవలను వినియోగించుకున్నందుకు ప్రతి ఎస్‌ఎంఎస్‌కు రూ.3 ఛార్జీ పడుతుంది. రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల మధ్య ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. కాగా, జూలై 1 నుంచి టికెట్ బుకింగ్ సమయంలో వెయిటింగ్ లిస్టును రైల్వేశాఖ తొలగించనున్నది.