Delhi Pollution: ఢిల్లీలో కాలుష్యం ప్రమాదస్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే అక్కడ గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ప్రజలు ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారింది. దీంతో అక్కడి కేజ్రీవాల్ ప్రభుత్వ చర్యలకు ఉపక్రమించింది. దేశ రాజధానిలో రేపటి నుంచి ప్రాథమిక పాఠశాలలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు 5వ తరగతి పై తరగతులు విద్యార్థుల బహిరంగ కార్యకలాపాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు తాము అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రాజధానిలో కాలుష్య పరిస్థితులు మెరుగుపడే వరకు స్కూళ్లను మూసివేయనున్నారు.
తీవ్ర వాయుకాలుష్య నేపథ్యంలో పాఠశాలలను మూసివేయాలని బీజేపీ, ఢిల్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పిల్లల జీవితాలను ఆడుకోవడం మానేసి స్కూళ్లను మూసివేయాలని బీజేపీ కోరింది. ఢిల్లీలో పార్ట్ టైమ్ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ పనిచేస్తున్నారని బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల విమర్శించారు. కాలుష్య నియంత్రణకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
Read Also: TRS MLAs: సుప్రీంకోర్టుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు వ్యవహారం
ఇదిలా ఉంటే ఢిల్లీ కాలుష్యం, ఢిల్లీ ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని.. కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఇది ఢిల్లీ, పంజాబ్ సమస్య మాత్రమే కాదని.. దేశ సమస్య అని అన్నారు. నిందలు, రాజకీయాలకు ఇది సమయం కాదని కేజ్రీవాల్ అన్నారు. వాహనాల సరి-బేసి విధానాన్ని అమలు చేస్తామని అన్నారు.
ఇదిలా ఉంటే ఢిల్లీ కాలుష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. నవంబర్ 10న ఆయా రాష్ట్రాల సీఎస్ లు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.