Land for jobs scam: బీహార్ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య మాజీ సీఎం రబ్రీ దేవికి ఢిల్లీలోని రోస్ ఎవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. లాలూతో పాటు ఆయన కుమార్తె హేమా యాదవ్‌ని ఫిబ్రవరి 9న తమ ముందు హాజరుకావాలని శనివారం ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ‘ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్’లో వీరందరికి సమస్లు వచ్చాయి.
Read Also: Breaking News: సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల భూకంపం.. 5 సెకన్లు కంపించిన భూమి
లాలూ కుటుంబం రైల్వే ఉద్యోగాలకు అభ్యర్థుల నుంచి భూములను తీసుకున్నట్లు ఈ కేసులో ప్రధాన అభియోగం. దీనిపై ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు చేసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ని ఢిల్లీ రోస్ ఎవెన్యూ కోర్టు అంగీకరించింది. ఈ కేసులో రబ్రీ దేవి, హేమా యాదవ్, మిసా భారతి, అమిత్ కత్యాలీ, హృదయానంద్ చౌదరి తదితరుల పేర్లతో సహా తొలి చార్జిషీట్‌ని ఈడీ ఫైల్ చేసింది. లాలూ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న అమిత్ కత్యాలీ, మాజీ రైల్వే ఉద్యోగి హృదయానంద్ చౌదరి కూడా ఈ కేసులో అదే రోజు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఈ నెల మొదట్లో కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు లాలూ యాదవ్, అతని కుటుంబ సభ్యులే అని ఈడీ కోర్టుకు వెల్లడించింది.
బీహార్‌లో ఆర్జేడీ-జేడీయూ కూటమి నుంచి నితీష్ కుమార్ బయటకు వెళ్తున్నట్లు, ఆయన మళ్లీ బీజేపీతో కలుస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా సమన్లు వచ్చాయి. 2004 మరియు 2009 మధ్యకాలంలో భారతీయ రైల్వేలోని వివిధ జోన్లలో గ్రూప్ “డి” స్థానాల్లో అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు అభ్యర్థుల నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులకు, ఏకే ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ట్రాన్‌ఫర్ చేశారు.