సింగపూర్ స్ట్రెయిన్‌తో భారత్‌లో థర్డ్ వేవ్ ప్రభావం ఉందని.. ఇది చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. వెంటనే ఆ దేశం నుంచి విమానాల రాకపోలకు నిలిపివేయాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు.. మరోసారి కేంద్రం వర్సెస్ ఢిల్లీ సర్కార్‌గా మారిపోయాయి.. సింగపూర్ వేరియంట్ పై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నష్ట నివారణ చర్యలు చేపట్టింది కేంద్రం.. ఆయన వ్యాఖ్యలపై సింగపూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. స్పందించిన భారత ప్రభుత్వం.. అరవింద్ కేజ్రీవాల్.. అసలు భారత్ తరపున మాట్లాడలేదంటూ స్పష్టం చేశారు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్-సింగపూర్ ద్వైపాక్షిక భాగస్వామ్యంతో ముందుకెళ్లాయని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.. ఆక్సిజన్ సరఫరాలతో పాటు లాజిస్టిక్స్ హబ్ గా సింగపూర్ కీలక పాత్ర పోషించిందని ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు.
మరోవైపు.. కేజ్రీవాల్ లాంటివారు చేసే వ్యాఖ్యలు.. బాధ్యతారాహిత్య రాహిత్యమని.. దీర్ఘకాల భాగస్వామ్యాలను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు విదేశీ వ్యవహారల మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి.. కరోనా స్ట్రెయిన్ ల ముద్ర వేస్తూ మాట్లాడే సాధికారత ఢిల్లీ సీఎంకు లేదని సింగపూర్ కు భారత్ స్పష్టం చేసింది. మరోవైపు.. అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.. కేంద్ర ప్రభుత్వం మన చిన్నారుల భద్రత కంటే సింగపూర్ అంటేనే ఎక్కువ శ్రద్ధ కనబరుస్తోందని మండిపడ్డారు.. భారత్ లో కోవడ్ థర్డ్ వేవ్‌తో చిన్నారులకు వాటిల్లే నష్టంపై ఢిల్లీ సర్కార్ ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం సింగపూర్ తో సంబంధాల గురించే ఎక్కువగా ఆందోళన చెందుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.