Delhi New CM: అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ నూతన ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఇంకా నిరీక్షణ కొనసాగుతోంది. అయితే, ఈ నిరీక్షణకు ఈరోజు (ఫిబ్రవరి 17) తెరపడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు కీలకమైన బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరుగనున్నట్టు పార్టీ వర్గాలు ప్రకటించాయి. కొత్తగా ఎన్నికైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభాపక్ష నేతను ఎంపిక చేసుకునేందుకు ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో సమావేశం కాబోతున్నారని తెలిపారు. ఇక, ముఖ్యమంత్రి రేసులో పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ, రేఖాగుప్తాతో పాటు మరికొందరు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
Read Also: Earthquake: ఢిల్లీలో భూకంపం.. పరుగులు పెట్టిన ప్రజలు..
ఇక, ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్‌కు త్వరలో తెరపడే ఛాన్స్ ఉందని బీజేపీ ఎంపీ యోగేంద్ర చందోలియా తెలిపారు. ఒకటి రెండ్రోజుల్లో కీలకమైన సమావేశం జరుగుతుంది.. అనంతరం దీనిపై ఓ క్లారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు. దాదాపు 27 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. ఫిబ్రవరి 5వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గ్రాండ్ విక్టరీ సాధించింది. 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా.. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో హవా కొనసాగించిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైపోయింది. ఆ పార్టీ ఛీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పలువురు కీలక నేతలు ఓడిపోయారు. మాజీ సీఎం అతిషి మాత్రమే గెలిచింది.